కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని వెట్‌ల్యాండ్స్ (చెరువులు, నీటి వనరులు) పరిరక్షణ, వాటి అధికారిక నోటిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణలో రాష్ట్రంలోని వెట్‌ల్యాండ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. వెట్ ల్యాండ్స్( కన్జర్వేషన్ అండ్ మేనేజ్ మెంట్) రూల్స్-2017 నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలన్నారు. చెరువులు, కుంటల సరిహద్దుల గుర్తింపు, డిజిటల్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. ఈ మేరకు సమావేశంలో అధికారులు మంత్రికి కీలక విషయాలు వివరించారు.
ఎస్ఏసీ అట్లాస్ లో గుర్తించిన రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి 12,249 వెట్‌ల్యాండ్స్ (Wetlands)పై గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియ పూర్తయిందని మంత్రి వెల్లడించారు. ఇప్పటివరకు సుమారు 4,023 వెట్‌ల్యాండ్స్‌కు సరిహద్దుల నిర్ధారణ పూర్తైందని వెల్లడించారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు సంయుక్త సర్వేలను వేగంగా పూర్తి చేసి “బ్రీఫ్ డాక్యుమెంట్స్” సిద్ధం చేయాలన్నారు. జిల్లా వెట్‌ల్యాండ్ అథారిటీల నుంచి ఖచ్చితమైన నివేదికలు వచ్చేలా శాఖల మధ్య సమన్వయం అవసరమని తెలిపారు. ఖమ్మం, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ప్రధాన వెట్‌ల్యాండ్స్ సహా 28 ప్రాంతాలకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రతిపాదనలు సిద్ధమైనట్లు వెల్లడించారు. ఇవి త్వరలో గెజిట్ నోటిఫికేషన్, ప్రజాభిప్రాయ సేకరణ దశలకు వెళ్లనున్నట్లు వివరించారు.
వెట్‌ల్యాండ్స్ పరిరక్షణలో నిపుణుల అభిప్రాయాలు, శాస్త్రీయ అధ్యయనాలు కీలకమని మంత్రి పేర్కొన్నారు. వెట్‌ల్యాండ్స్‌లో ఆక్రమణలు, ఘన వ్యర్థాల పారవేత, శుద్ధి చేయని మురుగు నీటి విడుదల వంటి కార్యకలాపాలు 2017 నిబంధనల ప్రకారం పూర్తిగా నిషేధించబడినవని తెలిపారు. మంజీరా అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన రామ్‌సార్ సైట్‌గా వన్యప్రాణి అభయారణ్యాన్నిగుర్తింపు పొందేందుకు పంపిన ప్రతిపాదనపై సైతం సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఇరిగేషన్ శాఖ వద్ద తుది అభిప్రాయాల కోసం ఉందని మంత్రికి అధికారులు చెప్పారు. అనంతరం కేంద్ర పర్యావరణ ( Environment Protection), అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు.

