కలం, మెదక్ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. మెదక్ (Medak) నియోజకవర్గ పరిధిలోని నామినేటెడ్ పదవులను భర్తీ చేయకపోవడం చర్చనీయంగా మారుతోంది. సెగ్మెంట్‌లోని మూడు వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ఆత్మకమిటీతో పాటు, తెలంగాణ రాష్ట్రంలోనే ప్రఖ్యాత దేవస్థానంగా పేరున్న మెదక్ ఏడుపాయల ఆలయ కమిటీని సైతం నియమించలేదు. పదేళ్ల పాటు మెదక్ లో కాంగ్రెస్ పార్టీని గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన వారికి ఏ నామినేటెడ్ పదవులను ఇప్పటికీ ఇవ్వకపోవడంపై మెదక్ కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏ ఒక్క నామినేటెడ్ పదవిని భర్తీ చేయకపోవడం పట్ల స్ధానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ (Mynampally Rohith) వైపే అన్ని వేళ్లు చూపిస్తున్నాయి.
నామినేటెడ్ పదవుల భర్తీ ఇంకెన్నాళ్లు…
మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మెదక్ ,పాపన్నపేట, రామాయంపేట వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు ఉన్నాయి. కాంగ్రెస్ సర్కారు ఏర్పడి రెండున్నరేళ్లు అయినా ఏ ఒక్క ప్రాంతంలో కుడా కమిటీలను ఏర్పాటు చేయలేదు. మార్కెట్ కమిటీ పాలక మండలిలో చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు కలిపి 14 మందికి అవకాశం కల్పించవచ్చు. అలా కమిటీ పరిధిలోకి వచ్చే ప్రాంతాలకు చెందిన అధికార పార్టీ నాయకులను మార్కెట్ కమిటీ సభ్యులు నియమించుకుంటారు స్ధానిక ఎమ్మెల్యే. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ పదవీ కాలం రెండేళ్లు. అలా ఇప్పటికే మార్కెట్ కమిటీల నియామకం జరిగితే, ఒక దఫా పదవీ కాలం ముగిసి.. రెండవ కమిటీ నియమించే వారు. అలా పార్టీ కోసం కష్టపడినవారికి మార్కెట్ కమిటీలో అవకాశం దక్కేది. కానీ మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తన పరిధిలోని ఏ ఒక్క అగ్రికల్చర్ మార్కెట్ కమిటీని నియమించలేదు. ఇదే తరహాలో మెదక్ నియోజకవర్గ ఆత్మకమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ , డైరెక్టర్ల నియామకం చేయలేదు. లక్షలాది మంది భక్తులు వచ్చే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల ఆలయానికి సైతం ఆలయ పాలక మండలిని ఏర్పాటు చేయకుండా జాప్యం చేస్తున్నారు.
అసంతృప్తిలో కాంగ్రెస్ కార్యకర్తలు
2014, 2018 ఎన్నికల్లో మెదక్‌లో బీఅర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఈ పదేళ్ల పాటు అధికారం లేనపోయినా, పార్టీ మారాలని ఒత్తిడి తెచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా మెజారిటీ క్యాడర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారు. 2023 ఎన్నికల్లో మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పద్మా దేవేందర్ రెడ్డి ఉన్నప్పటికి , బీఆర్ఎస్ పార్టీ నుండి మైనంపల్లి హనుమంతరావు కుమారుడు రోహిత్ రావు టికెట్ ఆశించాడు. అయితే బీఆర్ఎస్‌లో టికెట్ వచ్చే పరిస్ధితి లేకపోవడంతో ఎన్నికల ముందు చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ అభ్యర్ధిగా మెదక్ బరిలో నిలిచాడు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా, నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు రోహిత్ గెలుపు కోసం కృషి చేశారు. అయితే రోహిత్ రావు ఎమ్మెల్యే అయ్యి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మెదక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమకు మంచి రోజులు వచ్చాయని సంతోషపడ్డారు. తమ పార్టీ అధికారంలో ఉండటంతో తమకు గుర్తింపు వచ్చి పదవులు వస్తాయని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా మెదక్ నియోజకవర్గానికి సంబంధించి ఏ ఒక్క నామినేటెడ్ పదవులను భర్తీ చేయలేదు. రెండున్నరేళ్లు గడుస్తున్నా మెదక్, రామాయంపేట, పాపన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీలు, మెదక్ ఆత్మకమిటీ, ఏడుపాయల ఆలయ పాలక మండలి నియామకం జరగలేదు. దీంతో మెదక్ కాంగ్రెస్ నాయకులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా గంప గుత్తగా ఏ నామినేటెడ్ పోస్టులు భర్తీ జరగకపోవడంపై మెదక్ కాంగ్రెస్ నాయకులు రగిలిపోతున్నారు.
ఎమ్మెల్యే రోహిత్ రావు పట్టుకోసమేనా..?
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రోహిత్ రావు మెదక్ నియోజకవర్గంపై పూర్తి స్ధాయిలో పట్టు కోసం ప్రయత్నం చేస్తున్నాడు. మెదక్ కు సంబంధించిన కీలక వ్యవహారాలు ఇప్పటికీ గతంలో ఎమ్యెల్యేగా చేసిన తన తండ్రి హన్మంతరావే చక్కబెడుతారని అంటుంటారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్న రోహిత్ రావుకు పార్టీలో, పాలనలో ఇబ్బంది లేకుండా ఉండాలనే నామినేటెడ్ పదువులను ఇవ్వకుండా ఆపుతున్నారని కొందరు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. నామినేటెడ్ పదవులను ఇస్తే ఎమ్మెల్యేగా రోహిత్ రావు ప్రాధాన్యత తగ్గుతుందనే భావన ఉండటం సరికాదని చెబుతున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న రోహిత్ రావు చొరవ తీసుకోకపోవడంతోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేయడం లేదని చెబుతున్నారు. సరైన సమయంలో నామినేటెడ్ పదవులు ఇచ్చి ఉంటే పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తించి, ప్రోత్సహించినట్టుగా ఉండేదని చెబుతున్నారు. రోహిత్ రావు గెలుపు కోసం కష్టపడిన కాంగ్రెస్ నాయకులకు ఎలాంటి అవకాశం రాలేదని చెబుతున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ వలన స్ధానికంగా గ్రూపు విభేదాలు, అసంతృప్తులకు వచ్చే అవకాశం ఉందనుకుంటే, సదరు నాయకులకు సర్ధి చెప్పి పదవులు ఇవ్వాలి గానీ అసలు పదవులు ఇవ్వకుండా ఏళ్ల పాటు జాప్యం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. జాప్యం వలన కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకొని మెదక్‌లో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గుర్తించి నామినేటెడ్ పదవులు ఇచ్చి న్యాయం చేయాలని కోరుతున్నారు.

