కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఎండలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 6 రోజుల పాటు తీవ్ర వడగాలులు, 44 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మంత్రి కీలక సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ఒకవైపు భగ్గుమంటున్న ఎండలు, మరోవైపు ఈదురు గాలులు, ఉరుములు-మెరుపులతో కూడిన అకాల వర్షాలు సంభవించే పరిస్థితులు ఉన్నందున ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ఎలాంటి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. తదుపరి రోజుల్లో జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో కూడా ఎండల తీవ్రత పెరిగే అవకాశముందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు రావద్దని మంత్రి కోరారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. తగినంత నీరు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ ద్రావణాలు తీసుకోవాలని.. ఎండలో పనిచేసే వారు తలకు రక్షణ కల్పించే వస్త్రాలు ధరించాలని సూచించారు.
ఎండల దృష్ట్యా ప్రజలకు వడదెబ్బలు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా, వైద్య సేవలు, అంబులెన్స్‌లు, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ వడదెబ్బ నివారణ చర్యలను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. రైతులు, కూలీలు, నిర్మాణ కార్మికులు, రహదారులపై పనిచేసే కార్మికులు ఎండ తీవ్రత సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈదురు గాలులు, ఉరుములు-మెరుపులు సంభవించే ప్రాంతాల్లో ప్రజలు చెట్ల కింద నిలబడకుండా, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని తెలిపారు.

