కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. గడచిన ఇరవై ఏండ్లలో ఎన్నడూ లేనంతగా ఈసారి సమ్మర్‌లో ఎండలు పెరిగిపోయాయి. పగటి ఉష్ణోగ్రతలు రెండు దశాబ్దాల రికార్డును బ్రేక్ చేశాయి. వారం రోజులుగా ముదిరిన వేసవి తీవ్రత మరో నాలుగైదు రోజులు కంటిన్యూ కానున్నది. రెండు రోజులుగా రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు జిల్లాల్లో డే టైమ్ టెంపరేచర్ 46 డిగ్రీలు దాటేస్తున్నది. ఇది 47 డిగ్రీలు టచ్ చేసినా ఆశ్చర్యం లేదని కేంద్ర, రాష్ట్ర వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈసారి నైరుతి రుతుపవనాలు గతేడాదికంటే ముందుగానే వస్తాయని వాతావరణ కేంద్రం చల్లటి వార్తను ఇచ్చినా ఇప్పుడు మాత్రం మండే ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. వడదెబ్బతో ఒక్క రోజులోనే తొమ్మిది మంది చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. మండల స్థాయి కమిటీ ఆ మరణాల కారణాలపై నిర్ధారణకు రావాల్సి ఉన్నది. హైదరాబాద్ నగరంలో 43 డిగ్రీలకు చేరిన టెంపరేచర్ 47 డిగ్రీల ‘ఫీల్ లైక్’ తరహాలో ఉన్నదని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.
అన్ని వ్యవస్థలపైనా ఈసారి సమ్మర్ ఎఫెక్ట్ :
రాష్ట్రంలో ఈ సంవత్సరం నమోదవుతున్న ఎండల ఎఫెక్ట్ ఈ సీజన్‌కు మాత్రమే పరిమితం కాకుండా ఏజ్ గ్రూపు, అనారోగ్యం తదితరాలతో ఒక్కొక్కరిపై ఒక్కో రకమైన సమస్యకు కారణమవుతున్నదని డాక్టర్లు చెప్తున్న మాట. ఇప్పటికే చాలా ప్రైవేటు ఆస్పత్రుల్లో వడదెబ్బ ప్రభావంతో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. మెడికల్ షాపుల్లో ఓఆర్ఎస్, గ్లూకోజ్ ప్యాకెట్ల సేల్స్ పెరిగింది. మరోవైపు వ్యవసాయం, విద్యుత్, ఆర్థిక వ్యవస్థలపైనా ఈ సమ్మర్ ఎపెక్ట్ వేర్వేరు రూపాల్లో కనిపిస్తున్నది. నిర్మల్, హనుమకొండ, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో రెండు రోజులుగా 46 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదై ‘హీట్ సెంటర్స్’గా మారాయి. ఈ జిల్లాల్లోనే ‘హీట్‌వేవ్ పాయింట్లు’ 80కు పైగా ఉన్నాయి. వాతావరణ శాఖ వివరాల ప్రకారం తెలంగాణలో 2005–2010 మధ్య 43–44 డిగ్రీల (సెంటిగ్రేడ్) దాటే రోజులు పరిమితంగా ఉండేవి. ఇటీవలి కాలంలో ప్రతీ వేసవిలో 45 డిగ్రీలు దాటే రోజులు పెరుగుతున్నాయి.
టెంపరేచర్ పెరగడానికి ఐదు కారణాలు :
ఇరవై ఏండ్లుగా ప్రతీ సంవత్సరం కొంచెంకొంచెంగా టెంపరేచర్ పెరిగిపోవడానికి ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితులతో పాటు భౌగోళికంగా తెలంగాణలోని ప్రత్యేక అంశాలూ కారణమన్నది శాస్త్రవేత్తల విశ్లేషణ. ఇందుకు ఐదు కారణాలను బలంగా ప్రస్తావిస్తున్నారు. ఉత్తర, మధ్య భారతదేశం నుంచి వేడి పొడి గాలులు తెలంగాణవైపు వీచడం; వర్షాలు ఆశించినంతగా లేకపోవడం; మచ్చుకు కూడా మేఘాలు ఏర్పడకపోవడం; గాలిలో తేమకు తగిన అవకాశాలు లేని ‘ల్యాండ్ లాక్డ్’ భూభాగంగా ఉండే భౌగోళిక స్వరూపం; పట్టణాల్లో కాంక్రీట్ విస్తరణ పెరగడం.. ఈ ఐదు కారణమని పేర్కొంటున్నారు. ఢిల్లీలోని వాతావరణ కేంద్రం తాజా అంచనాల ప్రకారం మరో నాలుగైదు రోజుల పాటు వడగాలులు తీవ్రంగానే కంటిన్యూ కావొచ్చని, కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఒకటి లేదా రెండు డిగ్రీల టెంపరేచర్ పెరగొచ్చని సూచించారు.
హైదరాబాద్‌లో ‘హీట్ ఐలాండ్ ఎఫెక్ట్’ :
జిల్లాల్లోని వాతావరణంతో పోలిస్తే హైదరాబాద్‌లో సాధారణంగా తక్కువ ఉష్ణోగ్రతలే ఉంటాయి. ఈసారి కూడా మాగ్జిమమ్‌గా 43 డిగ్రీలు దాటలేదు. కానీ ‘ఫీల్ లైక్’ ఫ్యాక్టర్ మాత్రం దాదాపు 47 డిగ్రీల తరహాలో ఉన్నది. సిటీలోనూ, శివారు ప్రాంతాల్లోనూ భారీగా సిమెంట్ కాంక్రీట్ వినియోగం, గ్రీన్ కవర్ (చెట్లు) తగ్గిపోవడం, అర్బనైజేషన్, రోడ్ల నిర్మాణం, ఫ్లైఓవర్లు, మెట్రోరైల్ లాంటి పనులు, ఆఫీసులు-ఇండ్లలో ఎయిర్ కండిషనర్ల వినియోగం, రోడ్లమీద వాహనాల్లో ఏసీల వినియోగం, వీటితో వెలువడే ఉష్ణోగ్రత.. ఇవన్నీ ‘హీట్ ఐలాండ్ ఎఫెక్ట్’కు కారణాలని అంచనా. డే టైమ్ టెంపరేచర్‌తో విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. పగటిపూట మాత్రమే కాక రాత్రి సమయాల్లోనూ టెంపరేచర్ నార్మల్‌కంటే ఎక్కువగానే కొనసాగుతున్నది. టెంపరేచర్ కారణంగా భూమిలో తేమ, భూగర్భ జలమట్టం కూడా దెబ్బతింటున్నాయి. తెలంగాణలో ప్రతి ఐదేళ్లకోసారి ‘ఈసారి అత్యంత సమ్మర్ హీట్’ అనే రికార్డు బ్రేక్ అవుతున్నది.
ఇరవై ఏళ్లలో టెంపరేచర్ మార్పులు ఇలా :
2006-2010 41-43 డిగ్రీలు
2011-2015 42-44 డిగ్రీలు
2016-2020 43-45 డిగ్రీలు
2021-2026 44-47 డిగ్రీలు
========
రాష్ట్రంలో నమోదైన టెంపరేచర్ (మే 21న)
మునగాల (సూర్యాపేట్) : 46.5 డిగ్రీలు
మంథని (పెద్దపల్లి) : 46.5
మందమల్లి (మంచిర్యాల) : 46.4
ధర్మపురి (జగిత్యాల) : 46.4
ఆసిఫాబాద్ (కుమ్రంభీ) : 46.4
వైరా (ఖమ్మం) : 46.4
పాల్వంచ (కొత్తగూడెం) : 46.4
వెంకటాపూర్ (ములుగు) : 46.4
కాళేశ్వరం (భూపాలపల్లి) : 46.4
కట్టంగూర్ (నల్లగొండ) : 46.4
కమలాపూర్ (హన్మకొండ) : 46.4
గంగాధర (కరీంనగర్) : 46.4
వేములవాడ (సిరిసిల్ల) : 46.4
భువనగిరి (యాదాద్రి) : 46.3
మామడ (నిర్మల్) : 46.3
మోర్తాడ్ (నిజామాబాద్) : 46.3
కురవి (మహబూబాబాద్) : 46.3
జైనధ్ (ఆదిలాబాద్) 46.2
నల్లబెల్లి (వరంగల్) : 46.2
అక్కన్నపేట్ (సిద్దిపేట్) : 46.1

