Mobile Popup Ad
Mobile Popup Ad

ఇందుర్తిలో అగ్నిప్రమాదం.. 20 లక్షల ధాన్యం బుగ్గిపాలు

కలం, కరీంనగర్ బ్యూరో: ​పెద్దపల్లి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. అన్నదాతల శ్రమ ఒక్కసారిగా బూడిదపాలైంది. జిల్లాలోని ఓదెల మండలం ఇందుర్తి (Indurthi) గ్రామంలో గురువారం భారీ అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. ఈ ప్రమాదంలో న‌లుగురు రైతులకు చెందిన సుమారు 20 లక్షల రూపాయల విలువైన ధాన్యం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామంలో గురువారం నాడు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చేతికొచ్చిన పంటను కాపాడుకుం దామనుకున్న రైతుల ఆశలపై ఈ ప్రమాదం నీళ్లు చల్లింది. కొంతమంది రైతులు పొలాల్లో వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో, ఆ నిప్పు రవ్వలు గాలికి ఎగసిపడ్డాయి. దురదృష్టవశాత్తూ పక్కనే ఆరబోసి ఉంచిన ధాన్యం కుప్పలకు ఈ మంటలు అంటుకున్నాయి. నిప్పు రవ్వలు వేగంగా వ్యాపించడంతో.. అక్కడ నిల్వ ఉంచిన న‌లుగురు రైతులకు చెందిన దాదాపు 60 బస్తాల ధాన్యం పూర్తిగా కాలి బూడిదైంది.

దీని విలువ సుమారు రూ.20 లక్షలుఉంటుందని అంచనా వేస్తున్నారు. మంటలు వ్యాపించడాన్ని గమనించిన స్థానిక రైతులు వెంటనే అప్రమత్తమయ్యారు. ట్రాక్టర్ల ద్వారా నీటిని తెచ్చి మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించారు. అయితే, వారు మంటలను అదుపులోకి తెచ్చే సమయానికే జరగాల్సిన భారీ నష్టం జరిగిపోయింది. ఏడాది పొడవునా కష్టపడి పండించిన పంట కళ్లముందే బూడిదైపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టామని, ఇప్పుడు తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, తమను ఆర్థికంగా ఆదుకోవాలని బాధితులు కన్నీరుమున్నీరవుతూ విజ్ఞప్తి చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>