కలం, కరీంనగర్ బ్యూరో: విద్య రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధ్యనాత ఇస్తుందని జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) అన్నారు. గురువారం చలిగల్‌లో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం స్థలాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, వాలంతరి డైరెక్టర్ జనరల్ అనితతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాఠశాల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలు, విద్యార్థులకు కల్పించాల్సిన మౌలిక వసతులు, భవన నిర్మాణం, రహదారి సౌకర్యాలు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే విధంగా అన్ని వసతులతో ఆధునిక పాఠశాల నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాఠశాల నిర్మాణానికి అవసరమైన అన్ని సదుపాయాలను సమగ్రంగా ప్రణాళికాబద్ధంగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, జగిత్యాల రూరల్ తహసీల్దార్ హకీమ్, సంబంధిత శాఖల అధికారులు, నాయకులు బాల ముకుందం, తదితరులు పాల్గొన్నారు.

