కలం, సూర్యాపేట: ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రజలకు ఉపాధి, ఆదాయ భద్రతను కల్పిస్తుందని, ఎక్కువ సంఖ్యలో హాజరై ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట (Suryapet) జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. గురువారం ఆత్మకూరు మండలం నెమ్మికల్, మద్దిరాల మండలం నూతనకల్, పోలుమల్ల గ్రామాల్లో ఉపాధి హామీ పనులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎండ నుంచి ఉపశమనం కోసం ఏర్పాటు చేసిన షెడ్, తాగునీరు, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు సిద్ధంగా ఉంచిన ఓఆర్ఎస్ ప్యాకెట్లను తనిఖీ చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా కూలీలు ఉదయమే పనులు ముగించుకునేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ సాదాసీదాగా, స్నేహపూర్వకంగా కూలీల వద్దకు వెళ్లి వారితో ముచ్చటించారు.
వేతనాలు జమవుతున్నాయా..? అని ఆరా
కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ కూలీలతో ముచ్చటించారు. వేతనాలు సమయానికి జమవుతున్నాయా?.. ప్రభుత్వం ప్రకటించిన సగటు వేతనం అందుతుందా?.. పనుల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా?.. అని అడిగి తెలుసుకున్నారు. కూలీలు తమ సమస్యలను కలెక్టర్‌కు వివరించగా, తక్షణ పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో వడదెబ్బ తగిలిన వారికి తక్షణ వైద్యం అందించేందుకు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన అత్యవసర మందులను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ తెలిపారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే ప్రజలు ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించి, వైద్యుల సలహాలు పాటించాలని ఆయన కోరారు.

