కలం, వెబ్‌డెస్క్: నియోజకవర్గాల పునర్విభజన అంశంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూపై మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం (Chidambaram) ఎక్స్ వేదికగా స్పందించారు. “నా యువ మిత్రుడు నారా లోకేశ్ నియోజకవర్గాల పునర్విభజన గురించి మాట్లాడే ముందు ఒక్కసారి లెక్కలు సరిచూసుకోవాలి” అంటూ ఆయన హితవు పలికారు. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం ఎలాంటి మార్పులు చేయకుండా పునర్విభజన చేపడితే, దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోల్చినప్పుడు లోక్‌సభలో ఐదు దక్షిణాది రాష్ట్రాల సాపేక్ష బలం ఘోరంగా పడిపోతుందని, కేవలం ఉత్తరాది రాష్ట్రాలే దీని వల్ల లబ్ధి పొందుతాయని చిదంబరం స్పష్టం చేశారు. ఈ గణిత సమీకరణాల వల్లే ప్రతిపక్షాలన్నీ ఏకమై రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించి, ఓడించాయని ఆయన గుర్తుచేశారు.
లోక్‌సభలో ప్రతి రాష్ట్రానికి సీట్ల సంఖ్యను 50 శాతం పెంచుతామంటూ బీజేపీ ఈ ప్రమాదకరమైన ఫలితాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించిందని, కానీ అది కేవలం ఒక భ్రమ మాత్రమేనని చిదంబరం ఎండగట్టారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న 25 లోక్‌సభ స్థానాలను అలాగే ఉంచినా, లేదా ఒకవేళ వాటిని 38 స్థానాలకు పెంచినా సరే.. ఆర్టికల్ 81ని మార్చకుండా డీలిమిటేషన్ నిర్వహిస్తే జనాభా ప్రాతిపదికన దేశవ్యాప్త మొత్తం స్థానాల్లో ఏపీకి ఉండే ‘సాపేక్ష ప్రాతినిధ్యం’ కచ్చితంగా తగ్గిపోతుందని ఆయన వివరించారు. కాబట్టి, ఈ విషయంలో లోకేశ్ లోతైన అవగాహనతో వ్యవహరించాలని, పునర్విభజన వెనుక ఉన్న అసలు లెక్కలను మరోసారి సరిచూసుకోవాలని చిదంబరం సూచించారు.

