కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) పాలసీ (Telangana EV Policy) తీసుకొచ్చిన తర్వాత వాటి రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రతి నెలా సగటున పది వేలకు పైగానే కార్లు, బైక్‌లు, బస్సులు, టాక్సీలు, ఆటోలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీల నుంచి పూర్తి మినహాయింపు ఉండడంతో వీటి విక్రయాలు బాగా పెరిగాయి. పాలసీ వచ్చిన తర్వాత దాదాపు రెండు లక్షల కొత్త ఈవీలు రోడ్డెక్కాయి. పెట్రోలు, డీజిల్ బాధ లేకుండా కరెంటుతో నడిచే ఈ బండ్లతో వినియోగదారులకు ఖర్చు తగ్గుతూ పర్యావరణానికి హాని తగ్గడం ఉపశమనం. కానీ ఆర్థికశాఖ వర్గాలు మాత్రం వీటి వల్ల ఆదాయం తగ్గిపోయిందనే నిరుత్సహం వ్యక్తమవుతున్నది. రిజిస్ట్రేషన్, రోడ్ టాక్స్ రూపంలో రావాల్సిన ఆదాయానికి గండి పడడమే కాకుండా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగినప్పుడు వాటి మీద ‘వ్యాట్’ రూపంలో పెరగాల్సిన ఆదాయాన్నీ కోల్పోతున్నామని వివరించారు.
ఈవీల డెలివరీకి రెండు నెలలు వెయిటింగ్ :
అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఈవీలను ప్రోత్సహిస్తున్నాయి. అనేక రకాల రాయితీలు ఇస్తున్నాయి. దీంతో ఈవీ స్కూటర్ల మొదలు లగ్జరీ కార్ల వరకు వీటి కొనుగోళ్ళు పెరిగాయి. పాలసీ రూపొందించే నాటికి రాష్ట్రమంతా కలిపి 50 వేల కంటే తక్కువే ఈవీలు ఉండేవి. కానీ ఈ రెండేండ్లలో దాదాపు 1.70 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇప్పుడు కొత్తగా ఈవీ కారు లేదా బైక్‌ను బుక్ చేస్తే రెండు నెలల తర్వాత డెలివరీ అయ్యేంతగా డిమాండ్ పెరిగింది. రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులు లేకపోవడంతో వాహనం ఖరీదులో దాదాపు 25% వినియోగదారులకు మిగులుతున్నది. దీనికి తోడు ప్రతి నెలా పెట్రోలు, డీజిల్ ఖర్చు తగ్గుతున్నది. పెట్రోలుతో నడిచే కారుకు ఒక్కో కి.మీ.కు దాదాపు ఏడు రూపాయలు ఖర్చవుతుంటే ఈవీలకు మాత్రం రూపాయిన్నరతోనే సరిపెట్టుకోవచ్చు. పర్యావరణపరంగా రిలీఫ్ కలుగుతున్నా ప్రతి నెలా పెట్రోల్, డీజిల్‌పై వచ్చే వ్యాట్ ఆదాయం మాత్రం బాగా పడిపోతున్నది.
పర్యావరణం భేష్.. ఆదాయానికి బ్రేక్ :
తెలంగాణ ప్రభుత్వం పెట్రోలు మీద 35.20%, డీజిల్ మీద 27% చొప్పున వ్యాట్ ఫిక్స్ చేసింది. ఆ ప్రకారం మూడేండ్లుగా సగటున ప్రతి ఏటా రూ. 15 వేల కోట్ల మేర ఆదాయం సమకూరుతున్నది. కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌ల సంఖ్య పెరగడంతో ఈ ఆదాతానికి గండి పడుతున్నది. ఒక్క సంవత్సరంలోనే దాదాపు మూడున్నర వేల కోట్ల మేర వ్యాట్ ఆదాయం తగ్గిపోయింది. ఒకవైపు రిజిస్ట్రేషన్, రోడ్ టాక్స్ మినహాయింపు ఇవ్వడంతో గడచిన రెండేండ్లలో దాదాపు రూ. 800 కోట్లు తగ్గిపోగా అదనంగా వ్యాట్ ఇన్‌కమ్ కూడా పడిపోయింది. మొత్తంగా నాలుగు వేల కోట్లకు పైగానే ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయింది. ఉదాహరణకు 2022-23లో రాష్ట్రానికి పెట్రోలు, డీజిల్‌పైన వ్యాట్ రూపంలో రూ. 14,929 కోట్ల మేర ఆదాయం వచ్చింది. ఆ తర్వాతి సంవత్సరం 2023-24లో రూ. 15,519 కోట్లు, 2024-25లో రూ. 15,516 కోట్ల మేర ఆదాయం సమకూరింది. కానీ ఈవీల కొనుగోళ్ళు దాదాపు రెండు లక్షలకు చేరువ కావడంతో పెట్రోలు, డీజిల్ సేల్స్ కూడా తగ్గింది. వ్యాట్ రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 2025-26లో రూ. 12,071 కోట్లకు తగ్గిపోయింది.
కొత్తగా రిజిస్టర్ అయిన ఈవీల సంఖ్యను పరిశీలిస్తే..
వాహన రకం 2024-25 2025-26
బైక్‌లు : 64,200 66,600
కార్లు : 5,000 19,000
టాక్సీలు : 860 1,350
ఆటోలు : 2,700 3,500
బస్సులు: 180 400
గూడ్స్, త్రీవీలర్స్ : 1,300 1,100
మొత్తం : 75,000 91500

