కలం, తెలంగాణ బ్యూరో: బండి భగీరథ్‌పై నమోదైన కేసులో నిందితుడిని వదిలేసి బాధితురాలిపైనే నిందలు వేయడం దారుణమని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) ఫైర్ అయ్యారు. మహిళలపై అణచివేతకు కుల, పితృస్వామ్య వ్యవస్థలోని ఆలోచనా విధానమే కారణమని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసుపై గాంధీభవన్‌లో గురువారం మీడియాతో మాట్లాడారు. నిర్భయ ఘటన నుంచి ఇప్పటిదాకా బాధితురాలినే నిందించే ధోరణే కొనసాగుతున్నదని గుర్తు చేశారు. కుల సమూహంలో నష్టపోయేది మహిళలేనని తమిళనాడులో పెరియార్ రామస్వామి ఎప్పుడో చెప్పారని గుర్తుచేశారు. బాలికల దుస్తులు, పెంపకంపై విమర్శలు చేయడం దారుణమన్నారు. పితృస్వామ్య సమాజంలో అబ్బాయిల హింసాత్మక ప్రవర్తనను ఒక సాధారణమైన ధోరణిగా చూసే భావజాలం విస్తృతమవుతోందన్నారు.
జెండర్ జస్టిస్ కోసం పోరాడాలి..
వ్యక్తులపై నిందలు మోపడం, బాధితురాలి వ్యక్తిత్వాన్ని చర్చకు పెట్టడం సహజమైపోయిందని, పితృస్వామ్య భావజాలంపై పోరాటం అనివార్యమవుతోందని మీనాక్షి నటరాజన్ అన్నారు. రాజకీయ పార్టీల్లో ‘సేఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ సోషల్ జెండర్ జస్టిస్ సెన్సిటైజేషన్ కమిటీ’లను ఏర్పాటు చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సోషల్ జస్టిస్ తర్వాత ఇప్పుడు జెండర్ జస్టిస్ కోసం కూడా పోరాడాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. బండి భగీరథ్ కేసులో బాధితురాలిని నిందించడానికి బదులు నేరస్థుడి పెంపకాన్ని ప్రశ్నించాలన్నారు. రాజ్యాంగంలో సమాన సమాజ స్ఫూర్తికి ఇంకా చాలా దూరంలో ఉన్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో తిరోగమన ఆలోచనలకు స్థానం లేదన్నారు. నీతి సూత్రాలు మాట్లాడేవారు ఇకనైనా వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు.

