కలం, వెబ్ డెస్క్: నేడు ఢిల్లీ(Delhi)లో జరుగుతున్న ఇరిగేషన్ సమావేశం తెలంగాణకు మరణ శాసనంగా మారే ప్రమాదం ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్(BRS) పార్టీకి రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఆయన అన్నారు. నేడు తెలంగాణ భవన్‌లో హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. నీటి వ్యవహారంలో తెలంగాణ (Telangana)కు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. గోదావరి నదీ జలాల అక్రమ తరలింపుపై బీఆర్ఎస్ మొదటి నుంచే అప్రమత్తం చేస్తోందని తెలిపారు. ఈ విషయంలో గతంలో అనేకసార్లు ప్రెస్‌మీట్లు పెట్టి వాస్తవాలు బయటపెట్టామని చెప్పారు. నల్లమల సాగర్, బనకచర్ల పేర్లు మారినా ఏపీ జల దోపిడీ మాత్రం ఆగలేదని మండిపడ్డారు. నీటి ద్రోహంలో కత్తి చంద్రబాబుదైతే, పొడిచేది రేవంత్ రెడ్డి(Revanth Reddy) అని విమర్శించారు. సమైక్య పాలనలో కాంగ్రెస్ తెలంగాణకు నీటి వాటాల్లో అన్యాయం చేసిందని, ఇప్పుడు మరో చారిత్రక ద్రోహానికి పాల్పడుతోందని ఆరోపించారు.
నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో రేవంత్ ప్రభుత్వం పద్ధతి ప్రకారమే ఏపీకి సహకరిస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. డీపీఆర్ ఆపాలని చెప్పి, చివరకు సంతకాలు పెట్టి తెలంగాణ నదీ జల హక్కులను కాలరాసారని విమర్శించారు. తెలంగాణకు చెందిన ప్రాజెక్టులను గతంలో తీవ్రంగా వ్యతిరేకించిన అధికారిని ఈ సమావేశానికి పంపడమే తెలంగాణకు ద్రోహమని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి సోయి ఉన్న ఇంజినీర్ ఒక్కరూ దొరకలేదా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో గోదావరి జలాలకు 400 టీఎంసీల అనుమతులు తెచ్చామని, అనేక ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులు సాధించామని గుర్తు చేశారు. రేవంత్ పాలనలో మాత్రం ఒక్క డీపీఆర్ కూడా ముందుకు వెళ్లలేదని విమర్శించారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు అవసరమైతే మరో ఉద్యమానికి సిద్ధమని హరీశ్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని, ప్రజాక్షేత్రంలో ఈ ద్రోహాన్ని ఎండగడతామని హెచ్చరించారు.
ఢిల్లీలో జరుగుతున్న సమావేశంలో ఏదైనా తప్పు జరిగితే తెలంగాణ నీటి చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ డే గా మిగిలిపోతుందని హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ ఎన్నిసార్లు అప్రమత్తం చేస్తున్నా నామమాత్రంగా బ్యాక్ డేట్ వేసి లెటర్లు మీడియాకు విడుదల చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని ముల్లు కర్రతో పొడుస్తూ మొద్దు నిద్ర లేపుతూనే ఉన్నామని వ్యాఖ్యానించారు. బనకచర్ల అయినా, నల్లమల సాగర్ అయినా మారింది పేరు మాత్రమే కానీ, ఏపీ జల దోపిడీ ఆగలేదన్నారు. రేవంత్ రెడ్డి వెళ్లను అనుకుంటూనే ఆనాడు ఢిల్లీ మీటింగ్ కు వెళ్లాడని, ఎజెండాలో లేదంటూనే బనకచర్లపై చర్చ జరిపాడని తెలిపారు. సంతకం పెట్టబోను అంటూనే సంతకం పెట్టి తెలంగాణ నదీ జలాల హక్కులను కాలరాసాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ జల దోపిడీకి రెడ్ కార్పెట్ వేశాడని విమర్శించారు. టెండర్ చివరి తేదీ అయిపోయాక సుప్రీం కోర్టుకు వెళ్లి నల్లమల సాగర్ ప్రాజెక్టుకు పరోక్షంగా అంగీకారం తెలిపాడన్నారు. పస లేని రిట్ వేసి పరిపూర్ణంగా నల్లమల సాగర్ కు మద్దతు ప్రకటించాడని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి పథకం ప్రకారమే సహకరిస్తూ చంద్రబాబుకు గురు దక్షిణ చెల్లిస్తున్నాడని హరీశ్ ఆరోపించారు. ఏపీ ఒత్తిడితో జరుగుతున్న మీటింగ్‌లో నేడు ఇంజినీర్లు పాల్గొంటున్నారని తెలిపారు. ఇది పేరుకే జలవివాదాల మీటింగ్ కానీ, తెలంగాణ నుంచి 200 టీఎంసీలను గంపగుత్తగా తరలించుకుపోయే నల్లమలసాగర్ అనే ప్రాజెక్టు సంబంధించిన కుట్ర అని వెల్లడించారు. ఇలాగే గతంలో కేంద్ర జల శక్తి శాఖ నిర్వహించిన సమావేశంలో ఏపీ ఈ ప్రాజెక్టునే ఏకైక ఎజెండాగా ముందుపెట్టిందన్నారు. ఇప్పుడు కూడా ఏపీ నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టునే తెరమీదకు తెచ్చి చర్చ చేస్తున్నారని తెలిపారు. రెండు షరతులకు ఒప్పుకుంటేనే ఢిల్లీ మీటింగ్ కు వస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపిందని హరీశ్ అన్నారు. మొదటి షరతుగా నల్లమల సాగర్‌కు డీపీఆర్ వెంటనే ఆపాలని, కేంద్రం అనుమతుల ప్రక్రియను తక్షణమే ఆపాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. రెండో షరతుగా ప్రీ ఫీజబులిటి రిపోర్టు ఆపినట్లు ఏపీ హామీ ఇవ్వాలని రాసారన్నారు. ఇప్పుడు హామీ లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశంలో ఎలా పాల్గొంటున్నారని ప్రశ్నించారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే రేవంత్ రెడ్డి పట్టించుకోడని, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
ఈ సమావేశంలో పాల్గొంటున్న ఆదిత్యా నాథ్ గతంలో 9వ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్‌లో పాల్గొన్నారన్నారు. ఆయన కాళేశ్వరం, గోదావరి, సీతారామ లిఫ్ట్ ప్రాజెక్టు, తుపాకులగూడెం, మిషన్ భగీరథ, చనాక కొరటా, రామప్ప డైవర్షన్‌లన్నీ అక్రమ ప్రాజెక్టులని, వీటిని నిలిపి వేయాలని చెప్పాడని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగునా వ్యతిరేకించిన వ్యక్తిని మీటింగ్‌కు పంపడమంటే తెలంగాణ ద్రోహం చేయడానికే కదా? అని నిలదీశారు. ఇది తెలంగాణ నీళ్లను ఏపీకి తీసుకువెళ్లే కుట్రలో భాగమేనని, తెలంగాణపై సోయి ఉన్న ఒక్క ఇంజినీర్ దొరకలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ నీటి హక్కులను గంపగుత్తగా ఏపీకి అప్ప చెప్పడమే ప్రభుత్వ చర్చల లక్ష్యమా అని అడిగారు. చంద్రబాబుతో దోస్తీ కట్టి, తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డిని తెలంగాణ సమాజం క్షమించదన్నారు. తెలంగాణ నీటి హక్కులను కాలరాసేందుకు ఏపీ ఒత్తిడితో కేంద్రం నిర్వహిస్తున్న ఢిల్లీ సమావేశాన్ని బహిష్కరించాలని, ప్రభుత్వం పెట్టిన షరతులకు వచ్చిన సమాధానాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు.


