epaper
Friday, January 30, 2026
spot_img
epaper

ఆర్​సీబీని కొని, జాక్వెలిన్​కు గిఫ్ట్​గా ఇస్తా.. జైలు నుంచే సుఖేశ్​ లెటర్​!

కలం, వెబ్​డెస్క్: ఐపీఎల్​ ఫ్రాంఛైజీ రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు (ఆర్​సీబీ) అమ్మకానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్​సీబీని కొంటానంటూ సీరమ్​ ఇన్​స్టిట్యూట్​ యజమాని, బిజినెస్​మాగ్నెట్​ అదర్​ పూనావాలా సహా పలువురు బిలియనీర్లు ముందుకొచ్చారు. అయితే, తాను కూడా ఆర్​సీబీని కొంటానంటూ.. తీవ్ర ఆర్థిక నేరాల ఆరోపణలు, ఈడీ కేసులతో రెండేళ్లుగా జైలులో ఉంటున్న ఆర్థిక నేరగాడు సుఖేశ్​ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar)​ లెటర్​ రాయడం సంచనలం కలిగిస్తోంది. ఈ మేరకు ఆర్​సీబీని కొనడానికి ఆసక్తి చూపిస్తూ జైలు నుంచే ఆయన లేఖ (లెటర్​ ఆఫ్​ ఇంటెంట్​) రాసి, తన లాయర్​ ద్వారా ఆర్​సీబీ ఓనర్స్​కు పంపారు.

లేఖలో.. తనను ఎల్​ఎస్​ హోల్డింగ్స్​ కంపెనీకి చైర్మన్​గా, ప్రమోటర్​గా పేర్కొన్న సుఖేశ్​.. ఆర్​సీబీ ఓనర్స్​ అయిన డియాగో గ్రూప్​కు ఈ లెటర్​ పంపారు. ఆర్​సీబీ అమ్మకానికి ఉందనే విషయం తెలిసిందని, అందుకే ఈ ఆఫర్​ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మార్కెట్​ ప్రకారం ఆర్​సీబీ వాల్యూను అనుసరించి, ఫ్రాంఛైజీపై అన్ని హక్కులనూ 100 బిలియన్​ డాలర్లకు (రూ.9వేల కోట్లకుపైనే) కొనేందుకు సిద్ధమని ఆ లేఖలో వివరించారు. మొత్తం సొమ్మును నగదుగా, మూడో పార్టీ ప్రమేయం అవసరం లేకుండా 48 గంటల్లో చెల్లిస్తానని పేర్కొన్నారు.

ఆర్​సీబీ జట్టుకు, ఆటగాళ్ల గౌరవానికి భంగం కలిగించనని హామీ ఇచ్చారు. ఏదైనా స్పోర్ట్స్​ జట్టును కొనాలనేది తన ప్రేయసి జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​ ఆశ అని, ఆర్​సీబీని కొని ఆమెకు గిఫ్ట్​గా ఇస్తానని ఆ లేఖలో తెలిపారు. తనపై ఉన్న కేసులన్నీ కేవలం ఆరోపణలని, తాను నేరం చేసినట్లు ఏ కోర్టులోనూ నిరూపించలేరన్నారు.

ఎల్​ఎస్​ హోల్డింగ్స్​ మీద ఎలాంటి కేసులూ లేవని, ఈ కంపెనీ బ్రిటిష్​ వర్జిన్​ ఐలాండ్స్​లో రిజిస్టర్​ అయినందున ఎలాంటి భయం అక్కర్లేదని చెప్పారు. ఈ కంపెనీ అమెరికా, లండన్​, దుబాయ్​, సింగపూర్​, హాంగ్​కాంగ్​, దుబాయ్​, రష్యా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ఆర్​సీబీని తనకు అమ్మాలనుకుంటే పర్సనల్​గా మీటింగ్​కూ హాజరవుతానని తెలిపారు. తన లెటర్​పై సమాధానం కోసం ఎదురుచూస్తుంటానని చెప్పారు.

ఎవరీ సుఖేశ్​ చంద్రశేఖర్​?

సుఖేశ్​ చంద్రశేఖర్​ (Sukesh Chandrasekhar) కు ఆర్థిక ప్రపంచంలో మాయలమరాఠీగా పేరుంది. బెంగళూరుకు చెందిన సుఖేశ్​ తండ్రి రబ్బర్​ కాంట్రాక్టర్​. వీళ్లది సాధారణ మధ్య తరగతి కుటుంబం. సుఖేశ్​… విలాసవంతమైన జీవితం గడపడం కోసం డిగ్రీ నుంచే ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. మొదట కర్ణాటక ప్రభుత్వంలో ఉద్యోగాల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు. అప్పటి నుంచే అతని మోసాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఒక్క బెంగళూరులోనే సుమారు 40కి పైగా కేసులు అతనిపై నమోదయ్యాయి.

ఆ తర్వాత ముంబైకి మకాం మార్చాడు. ప్రముఖుల కుమారుడినని, బంధువునని చెప్పుకుంటూ అనేక ఆర్థిక నేరాలకు, బెదిరింపులకు పాల్పడ్డారు. అతని ట్రాప్​లో చిక్కి ఎంతో మంది డబ్బులు అర్పించుకున్నారు. తద్వారా రూ.వేల కోట్లు సంపాదించి లగ్జరీ లైఫ్​ అనుభవించడం మొదలుపెట్టాడు. బాలీవుడ్​ హీరోయిన్​లను వెంట తిప్పుకున్నారు. హీరోయిన్​ జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​ సైతం ఇతని మోసాలకు బలైంది. ఈ క్రమంలో సుఖేశ్​ నేరాలు ఒక్కొక్కటిగా బయటపడడంతో ఈడీ కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం జైలులో ఊచలు లెక్కపెడుతున్నారు.

అయితే, అక్కడా తన దందా ఆపలేదు. బెయిల్​ ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి ప్రముఖ ఫార్మా కంపెనీ ఓనర్​ శివిందర్​ మోహన్​సింగ్ నుంచి రూ.200 కోట్లు కొట్టేశారు. జైలు అధికారులను, సిబ్బందిని సైతం లంచాలతో బోల్తా కొట్టించి, తన పనులు సాఫీగా చేయించుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్న సుఖేశ్​ వద్ద రూ.వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు చెప్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>