‘మా దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి’.. కేటీఆర్‌కు ఎంపీ చామల వార్నింగ్

కలం, భువనగిరి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ (Bhuvanagiri MP) చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన కుటుంబం తప్ప తెలంగాణలో ఎవరూ బాగుపడకూడదనే కుంచిత భావజాలంతో కేటీఆర్ మాట్లాడుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో “నా కుటుంబ సభ్యులు ఎవరూ రాజకీయాల్లోకి రారు” అని చెప్పిన కేసీఆర్, అధికారంలోకి వచ్చాక దాన్ని పూర్తిగా విస్మరించారని ఎంపీ గుర్తుచేశారు.

దాదాపు 1600 మంది అమరవీరుల బలిదానాలతో సిద్ధించిన తెలంగాణలో, కేవలం కేసీఆర్ కుటుంబంలోనే ఐదుగురికి పదవులు దక్కాయని మండిపడ్డారు. అమెరికా నుంచి నేరుగా వచ్చి కేటీఆర్ మంత్రి అయ్యారని, ఎమ్మెల్యే కాకముందే హరీష్ రావు కూడా మంత్రి పదవి పొందారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిబద్ధతను వివరిస్తూ.. “సీఎంగా రేవంత్ రెడ్డికి తన ఐదుగురు సోదరులకు ఏ పదవి అయినా ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ నాయకుల్లాగా ఆయన తన కుటుంబానికి పదవులు ఇచ్చుకోలేదు” అని స్పష్టం చేశారు.

సాధారణ పౌరులకు భూమి కేటాయింపు ప్రక్రియ ఎలా జరుగుతుందో, రేవంత్ రెడ్డి సోదరుడు కూడా నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకుంటేనే భూమి కేటాయించారని విస్పష్టంగా తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని ఎంపీ చామల మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దోచుకోవచ్చనే దురాశతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిగా పక్కనబెట్టిందని ఆరోపించారు.

కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో ఎవరెవరికి భూములు కట్టబెట్టారో, ఏ దోస్తులకు కంపెనీలు అప్పగించారో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తమ వద్ద ఉన్నాయని హెచ్చరించారు. కుటుంబంలో ఆస్తులు, పదవుల పంపకాల విషయంలో తేడాలు రావడం వల్లే కవిత కొత్త పార్టీ పెట్టే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేసిన ఎంపీ, కేటీఆర్ ఇప్పటికైనా పిచ్చి మాటలు బంద్ చేసి, వాస్తవాలు గ్రహించాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>