కలం, వెబ్ డెస్క్: టాటా సన్స్ సంస్థ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్.. తన పదవికి రాజీనామా చేశారు. ఈనెల 18న టాటా గ్రూప్ జనరల్ బాడీ మీటింగ్ జరగనుండగా.. ఈ మీటింగ్ కు ముందే చైర్మన్ పదవికి చంద్రశేఖరన్ రాజీనామా చేయడం గమనార్హం. చంద్రశేఖరన్ రాజీనామా (Tata Sons Chairman Chandrasekaran)తో టాటా గ్రూప్‌లో తదుపరి నాయకత్వంపై ఉత్కంఠ నెలకొంది. 2017లో బాధ్యతలు చేపట్టిన ఆయన.. సంస్థలో అంతర్గత విభేదాలతో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఆయన పదవీకాలం 2027 ఫిబ్రవరి వరకు ఉన్నప్పటికీ ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
కంపెనీ వాటా దారులతో నెలకొన్న ఉద్రిక్తతలు, చంద్రశేఖరన్ -టాటా ట్రస్ట్ ఛైర్మన్ నోయల్ టాటా మధ్య విభేదాల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్‌కు 66 శాతంషేర్, అలాగే ప్రత్యేక అధికారాల వల్ల నోయల్ టాటా నిర్ణయాలు కీలకంగా మారాయి. అంతేకాకుండా సర్ రతన్ టాటా ట్రస్ట్‌పై మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం, వ్యాపారాల్లో నష్టాలు రావడంతో ఆయన రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
టాటా సన్స్ ఛైర్మన్(Tata Sons Chairman)గా చంద్రశేఖరన్ వైదొలగటంతో టాటా గ్రూప్ షేర్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. టాటా కన్సుల్టేన్సీ సర్వీసెస్ (TCS) షేర్లు 4.29 శాతం, టాటా స్టీల్ 1.65 శాతం, టైటాన్ 1.33 శాతం, టాటా పవర్ 1.29 శాతం, ట్రెంట్ 0.26 శాతం, టాటా మోటార్స్ 2.47 శాతం మేర నష్టపోయాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 560+, నిఫ్టీ 180+ పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి.
Also Read : గనుల సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం!
Follow Us On : WhatsApp

