కలం, వెబ్ డెస్క్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఎన్డీయే ప్రభుత్వ పిలుపు మేరకు దేశ రాజధాని ఢిల్లీలో ‘హర్ ఘర్ తిరంగా (Har Ghar Tiranga Rally)’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా దేశభక్తిని చాటే విధంగా భారత్ మండపం నుంచి ఇండియా గేట్ వరకు తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. భారత్ మండపం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీని ఉపరాష్ట్రపతి సి.పీ. రాధాకృష్ణన్ జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర మంత్రులు, ఎన్డీఏ ఎంపీలు పెద్ద సంఖ్యలో పాల్గొని త్రివర్ణ పతాకాలను ప్రదర్శించారు. ఆగస్టు 15 సందర్భంగా గత ఐదేళ్లుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా ప్రచారం నిర్వహిస్తోంది.
దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటుతూ నిర్వహించిన ఈ ర్యాలీ మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియం వైపు సాగింది. పంద్రాగస్టును పురస్కరించుకుని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కేంద్రం ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు జాతీయ జెండాలు చేతబూని ‘మైభారత్’ యువ వాలంటీర్లతో కలిసి ర్యాలీలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ స్వయంగా పాల్గొన్నారు. దేశంలో ప్రతీ పౌరుడిలో దేశభక్తి, జాతీయ సమైక్యతను పెంపొందించడమే ఈ ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచార ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. యువత దేశ నిర్మాణంలో భాగస్వామ్యమై, జాతీయ స్ఫూర్తిని చాటాలని ఆకాంక్షించారు.
అటు హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీలో BSF జవాన్లు పాల్గొని దేశభక్తిని చాటారు. వందేమాతరం 150వ వార్షికోత్సం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీలో బీఎస్ఎఫ్ అధికారులు పాల్గొన్నారు. 2026లో భారతదేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. వందేమాతరం జాతీయ గీతం 150 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మోడీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది.

