కలం, ఖమ్మం బ్యూరో: అడవుల్లో క్రూర జంతువుల వేట కోసం అమర్చుతున్న విద్యుత్ ఉచ్చులు నిరపరాధుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా బూర్గంపాడు (Burgampadu) మండలం నకిరిపేట సమీపంలోని అటవీ ప్రాంతంలో వేటగాళ్లు ఏర్పాటు చేసిన కరెంట్ వైర్లు తగిలి చెరువు సింగారం వెస్ట్ బీట్ ఫారెస్ట్ ఆఫీసర్ నవీన్ మృతి చెందారు. విధుల్లో భాగంగా అటవీ ప్రాంతంలో తనిఖీలకు వెళ్లిన సమయంలో ఆయన ప్రమాదవశాత్తు ఈ విద్యుత్ తీగలను తాకడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై అటవీ, పోలీసు అధికారులు కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరుపుతున్నారు.
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా అడవుల్లో అనధికారికంగా ఏర్పాటు చేస్తున్న ఈ కరెంట్ ఉచ్చులు రోజురోజుకీ తీవ్ర ప్రమాదకరంగా మారుతున్నాయి. వేటగాళ్లు వైర్లతో ఏర్పాటు చేస్తున్న ఈ తీగలు కేవలం మూగజీవాలకే కాకుండా, అడవుల్లో సంచరించే మనుషులు పశువుల ప్రాణాలను సైతం బలి తీసుకుంటుండటంతో స్థానికులలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా మణుగూరు రేంజ్ పరిధిలో ఓ అటవీశాఖ అధికారి ఇదే రీతిలో విద్యుత్ తీగలకు బలై ప్రాణాలు కోల్పోగా, ఇటీవల చండ్రుగొండ మండలంలో వేటగాళ్ల ఉచ్చుకు చిక్కుకుని పలు గేదెలు అక్కడికక్కడే మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
జిల్లాలో విస్తారమైన అటవీ ప్రాంతం ఉన్నప్పటికీ, వేటగాళ్ల కదలికలపై, ఇలాంటి విద్యుత్ ఉచ్చులపై అటవీశాఖ అధికారుల నిఘా కొరవడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అటవీ, విద్యుత్ శాఖల అధికారులు తక్షణమే స్పందించి అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా, తనిఖీలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. అనధికారికంగా కరెంట్ తీగలు అమర్చే వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుని, ఇలాంటి విషాదకర ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

