కలం, తెలంగాణ బ్యూరో: Private School Fees | రాష్ట్రంలో విద్యా వ్యవస్థ తీరు ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్నట్లుగా తయారైంది. విద్యార్థుల సంఖ్యలోగానీ, ప్రమాణాల్లోగానీ, పాస్ పర్సంటేజీలోగానీ ప్రైవేటు స్కూళ్లతో సర్కారు స్కూళ్లు పోటీ పడలేకపోతున్నాయి. దాదాపు 27 వేల సర్కారు పాఠశాలలున్నా, మూడున్నర లక్షల మంది ఉపాధ్యాయులున్నా చదువుకునే విద్యార్థుల సంఖ్య మాత్రం 25లక్షల లోపే. ఏటేటా కుప్పలు తెప్పలుగా ప్రైవేటు పాఠశాలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 12 వేల ప్రైవేటు విద్యాసంస్థలుంటే అందులో చదివే విద్యార్థులు 38 లక్షల మంది. ఎన్ని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినా, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్సులు కట్టినా ప్రైవేటును నియంత్రించడంలో ప్రభుత్వాల కార్యాచరణ తూతూ మంత్రమే.
ఒక్కో విద్యార్థిపై సగటున సంవత్సరానికి లక్ష రూపాయలకంటే ఎక్కువే ఖర్చు చేస్తున్నామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారు. విద్యాశాఖ కూడా ఆయన దగ్గరే ఉన్నది. పేద పిల్లలను ఉచితంగా చదివిస్తున్నామని గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ తల్లిదండ్రులు మాత్రం ఫీజులు ఎక్కువైనా ప్రైవేటు స్కూళ్లకే సై అంటున్నారు. ప్రైవేట్ లో ఫీజులను నియంత్రించడంలో సర్కారు ఫెయిల్. గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమైనా, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా దొందూ.. దొందే.. పొలిటికల్ లీడర్లు, పలుకుబడి ఉన్నవారే ప్రైవేటు స్కూళ్ళ యజమానులు కావడంతో సర్కారు నియంత్రణా చర్యలు శూన్యం.
డిగ్రీ కోర్సులకంటే ప్రైమరీ చదువుకే ఎక్కువ ఖర్చవుతున్నది. నర్సరీ చదివేవారికి రూ.30 వేల నుంచి 3 లక్షల దాకా ఫీజు. బడ్జెట్, స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటూ.. కేటగిరీని బట్టి వసూళ్లు. ఏ తరగతి అయినా ఫీజులు లక్షల్లోనే. అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు యాక్టివిటీస్, యూనిఫామ్, బుక్స్, ట్రాన్స్‌పోర్ట్, బ్రేక్‌ఫాస్ట్/మీల్స్.. ఇలా రకరకాల పేర్లతో ప్రైవేట్ స్కూళ్లు పేదలు, లోయర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలను దోచేస్తున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీ‘జులుం’ ఆటకట్టించాలని పేరెంట్స్ అసోసియేషన్స్ ప్రతి సంవత్సరం ఆందోళనలు చేయడం ఆనవాయితీగా మారింది. చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాలు హామీలివ్వడమూ రొటీన్ ప్రాక్టీస్.
తెలంగాణ ఏర్పడి పుష్కరకాలమైనా ఫీజుల నియంత్రణ చట్టమే లేదు. ప్రైవేట్ మేనేజ్‌మెంట్లు ఏటా 10–30 శాతం చొప్పున ఫీజుల్ని పెంచుతూనే ఉన్నాయి. అత్యధిక ఫీజులున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. నర్సరీ నుంచి డిగ్రీ దాకా ఇదే తంతు. ప్రైవేటు విద్యాసంస్థల ప్రారంభోత్సవానికి స్వయంగా ముఖ్యమంత్రే వెళ్లడం దేనికి సంకేతం? ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చు గురించి ప్రస్తావించి ప్రైవేటు స్కూళ్ల ఫీజుల గురించి మాట్లాడకపోవడం విడ్డూరం. ఫీజుల నియంత్రణ చట్టం తెస్తామంటూ మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్.. తల్లిదండ్రులపై పిల్లల చదువుల భారాన్ని తగ్గిస్తుందా?.. ఫీజుల నియంత్రణ చట్టాన్ని తెస్తుందా?.. రాష్ట్రంలో ఫీజుల దోపిడీపై ‘కలం 360 డిగ్రీస్‘ ప్రత్యేక కథనం చదివేందుకు కింద ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: మంత్రి సొంత జిల్లాలో మంచినీళ్ళకు కరువు
Follow Us On : WhatsApp

