కలం, తెలంగాణ బ్యూరో : వేసవిలో తాగునీటికి ఇబ్బందులు రావద్దంటూ ప్రభుత్వం వివిధ శాఖల అధికారులను అప్రమత్తం చేసింది. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క (Seethakka) సైతం మిషన్ భగీరధ అధికారుల మొదలు పంచాయతీరాజ్ ఆఫీసర్ల వరకు అందరితో రాష్ట్రవ్యాప్త తాగునీటి సమస్యలపై ఇటీవలే రివ్యూ చేశారు. వేసవి కాలంలో ఏ గ్రామం కూడా తాగునీటికి ఇబ్బందులు రావద్దని, అవసరమైన మేరకు సరఫరా చేయడంపై దృష్టి సారించాలని ఆఫీసర్లను ఆదేశించారు. ప్రభుత్వం రివ్యూలు, కాగితాల మీద లెక్కలు ఎలా ఉన్నా గ్రౌండ్ స్థాయిలో మాత్రం మంచినీటికి ఇక్కట్లు తప్పడంలేదు. పంచాయతీరాజ్ మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు జిల్లాలోనే తాగునీటికి కటకట ఏర్పడింది. ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం లేదని భావించిన స్థానిక ఆదివాసీలు సొంతంగా మూడు నెలల పాటు కష్టపడి బావిని తవ్వుకున్నారు.
ప్రభుత్వంపై ఆధారపడి ప్రయోజనం లేక :
పేరుకు ప్రజాప్రభుత్వమే అయినా ప్రజల అవసరాలను మాత్రం తీర్చలేకపోతున్నది. దీంతో ప్రభుత్వంపై ఆధారపడి ప్రయోజనం లేదని భావించిన ములుగు జిల్లా మంగపేట మండలం శాంతినగర్ గ్రామ ఆదివాసీలు సొంతంగా మూడు నెలల పాటు శ్రమించి బావిని తవ్వుకున్నారు. కానీ వారి కష్టానికి తగిన ప్రతిఫలం రాలేదు. గ్రామ పంచాయతీ అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని గ్రహించిన గొత్తికోయలు వారి కాలనీలో బావిని తవ్వుకున్నారు. దాదాపు 30 అడుగుల మేర తవ్వినా చుక్క నీరు రాలేదు. గ్రౌండ్ వాటర్ లెవల్ గురించి వారికి అవగాహన లేకపోవడంతో ఒక ప్రయత్నంగా సొంతంగా శ్రమించి బావిని తవ్వుకున్నారు. వేసవిలో తాగునీటి కష్టాలు కేవలం ములుగు జిల్లాకు మాత్రమే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని మొత్తం 12,760 గ్రామ పంచాయతీల్లో అధికారులు పరిశీలన చేసిన 10,608 పంచాయతీల్లో 176 చోట్ల నీటి సరఫరా లేదని తేల్చారు.
రిపోర్టు పంపడంలో అధికారుల అలసత్వం :
నిజానికి ప్రతీ జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఏరోజుకారోజు తాగునీటి సరఫరాపై మంత్రి పేషీకి ఆ శాఖ అధికారులు గణాంకాలను పంపించాలి. ఎన్ని గ్రామ పంచాయతీల్లో నీటి సరఫరా జరుగుతున్నది, ఎక్కడెక్కడ నీరు సరఫరా కావడంలేదు, ఎన్ని నీటి కనెక్షన్లు ఉన్నాయి, ఎన్నింటి ద్వారా వాటర్ సప్లై జరుగుతున్నది, క్లోరీనేషన్ జరిగిన గ్రామాలెన్ని, ఎన్ని బోర్‌వెల్స్ పనిచేస్తున్నాయి, ఎన్ని పనిచేయడంలేదు, ఎన్ని చేతిపంపులు పనిచేయడంలేదు.. ఇలాంటి వివరాలన్నింటినీ ప్రతీ రోజు ఆ శాఖకు పంచాయతీరాజ్ శాఖ జిల్లా స్థాయి అధికారులు రిపోర్టు చేయాలి. కానీ మంత్రి ఆదేశాలు ఉన్నా అన్ని గ్రామ పంచాయతీల నుంచి రిపోర్టు రావడంలేదు. ఉదాహరణకు మంత్రి సొంత జిల్లా ములుగునే పరిగణనలోకి తీసుకుంటే 171 గ్రామ పంచాయతీల్లో కేవలం 57 చోట్ల నుంచి మాత్రమే (మార్చి 31న) రిపోర్టు వచ్చింది. మంత్రి చెప్పినా క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు పేలవం. మంత్రి సీతక్క(Seethakka) ఆదేశాలనే ప్రభుత్వ సిబ్బంది పట్టించుకోనప్పుడు ఇక స్థానిక ఆదివాసీలు ఎంత మొరపెట్టుకున్నా ప్రయోజనం ఏముంటుంది? అందుకే సొంతంగా బావి తవ్వుకునే ప్రయత్నం చేశారు.
Read Also: విజిలెన్స్ అధికారుల ముసుగులో మోసం
Follow Us On : WhatsApp

