కలం, నిజామాబాద్ బ్యూరో : భావి తరాలకు బంగారు భవిష్యత్తు అందించాలనే సమున్నత ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి (Nizamabad Collector Ila Tripathi) అన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా సర్కారు బడులలో నాణ్యమైన విద్యా బోధనను అందించడంతో పాటు మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపర్చేందుకు చిత్తశుద్ధితో కృషి కొనసాగుతోందని తెలిపారు. మోపాల్ మండలం బోర్గాం (పి) జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సందర్శించారు.
ఈ పాఠశాలలో విద్యార్థులకు చేర్పించేందుకు తల్లిదండ్రులు పోటీ పడుతుండడాన్ని గమనించిన కలెక్టర్ (Collector Ila Tripathi) వారితో భేటీ అయ్యారు. తమ పిల్లలను ప్రైవేటు బడుల నుండి ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు తెలుపడంతో కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రైవేటు స్కూల్లో ఫీజుల భారం ఎక్కువగా ఉండడమే కాకుండా, ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్యను అందిస్తుండడంతో సర్కారు బడిలో తమ పిల్లలను చేర్పిస్తున్నామని తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఈ విషయాలను వివరిస్తూ మిగితా వారిని కూడా ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు.
ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటుకు దీటుగా మంచి ఫలితాలు సాధిస్తున్నాయని, పదవ తరగతిలో 87 శాతం సగటు ఉత్తీర్ణత సాధించిన బోర్గాం(పి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలనే ఇందుకు నిదర్శనమని అన్నారు. ప్రభుత్వ తోడ్పాటును ప్రతి విద్యార్ధి సద్వినియోగం చేసుకుని చక్కటి భవిష్యత్తుకు మార్గం సుగమం చేసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. ఆయా తరగతులను సందర్శించి విద్యార్థిని, విద్యార్థుల బోధనా సామర్ధ్యాన్ని పరిశీలించి, బహుమతులు అందజేశారు. బాలబాలికలకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ చేశారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి పి.అశోక్, మోపాల్ తహసిల్దార్ రేఖ, ఎంఈవో సాయిలు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్ తదితరులు ఉన్నారు.
Read Also: రేవంత్ వార్నింగ్.. ఆఫీసర్లు డోంట్ కేర్!
Follow Us On: Sharechat

