Mobile Popup Ad
Mobile Popup Ad

పిల్లల భద్రతే ముఖ్యం.. ప్రతి పేరెంట్ తప్పక చెప్పాల్సిన సేఫ్టీ రూల్స్

కలం, వెబ్‌డెస్క్: Child Safety Tips | నేటి కాలంలో పిల్లల భద్రత అనేది ప్రతి తల్లిదండ్రులకూ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. పిల్లలు స్కూల్ నుండి, ఆటస్థలం నుండి లేదా బయట ఎక్కడికైనా వెళ్ళి సురక్షితంగా ఇంటికి రావాలంటే వారికి చిన్నతనం నుంచే కొన్ని జాగ్రత్తలు నేర్పించడం చాలా ముఖ్యం. అపరిచితులు, అనుమానాస్పద వ్యక్తులు, ప్రమాదకర పరిస్థితులు ఎదురైనపుడు వాటిని అధిగమించేందుకు మనం కొన్ని అబద్దాలు/జాగ్రత్తలు నేర్పించాలి.

చిన్నప్పటి నుంచే పిల్లలకు నిజాయితీ, మంచి ప్రవర్తన, పెద్దలను గౌరవించడం వంటి విలువలను నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత. నిజాయితీ అనేది మంచి లక్షణమే అయినప్పటికీ కొన్ని సార్లు పిల్లల భద్రత కోసం నిజాయితీ పక్కనపెట్టి సమయస్పూర్తితో వ్యవహరించడం చాలా ముఖ్యం. అయితే ఇది అబద్ధాలు నేర్పించడం ముమ్మాటికీ కాదు. తమను తాము రక్షించుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు నేర్పించడం (Child Safety Tips) అని చెబుతున్నారు నిపుణులు. ఎటువంటి సందర్భాల్లో పిల్లలు జాగ్రత్తగా ఉండి తమ సమయస్పూర్తిని ఉపయోగించాలో తెలుసుకుందాం.

తలుపు అస్సలు తీయకూడదు

ఉదాహరణకు, కొన్నిసార్లు పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. అలాంటి సమయంలో ఎవరైనా తలుపు తట్టి “అమ్మానాన్న ఇంట్లో ఉన్నారా?” అని అడిగితే, పిల్లలు వెంటనే “నేను ఒక్కడినే ఉన్నాను” అని చెప్పడం చాలా ప్రమాదకరం. అలా చెప్పడం వల్ల దుండగులు పిల్లలు ఒంటరిగా ఉన్నారని గ్రహించి ఇంట్లోకి చొరబడే అవకాశం ఉంది. అందుకే అలాంటి సమయంలో “అమ్మానాన్న ఇంట్లోనే ఉన్నారు, బిజీగా ఉన్నారు” అని చెప్పి తలుపు తెరవకుండా ఉండాలని పిల్లలకు నేర్పించడం చాలా ముఖ్యం. ఈ చిన్న జాగ్రత్త వారిని అనేక ప్రమాదాల నుంచి కాపాడుతుంది.

అపరిచితుల ఆశలకు ‘నో’ చెప్పడం

పిల్లల మనసు చాలా అయాయకమైనది. చాలా మంది పిల్లలు చాక్లెట్లు, బిస్కెట్లు, బొమ్మలు వంటి వాటికి సులభంగా ఆకర్షితులవుతారు. దీనిని అదునుగా తీసుకున్న అపరిచిత వ్యక్తులు చాక్లెట్లు, బిస్కెట్లు చూపించి మోసం చేసే ప్రమాదముంది. అందువల్ల అపరిచితుల నుంచి ఎలాంటి బహుమతులు, ఆహార పదార్థాలు లేదా వస్తువులు తీసుకోకూడదని పిల్లలకు స్పష్టంగా చెప్పడం చాలా ముఖ్యం. ఎవరైనా బలవంతం చేస్తే వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్లి తల్లిదండ్రులకు లేదా నమ్మకమైన పెద్దలకు చెప్పాలని నేర్పించాలి.

ఉచిత లిఫ్ట్ ఆఫర్లు.. ఊహించని ప్రమాదాలు!

పిల్లలు రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఎవరైనా “లిఫ్ట్ ఇస్తాం, లేదా నీ ఇంటి దగ్గర దించేస్తాం” అని పిలిచినా అస్సలు నమ్మకూడదని పిల్లలకు గట్టిగా చెప్పాలి. అలాంటి సందర్భాల్లో వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్లడ లేదంటే “నన్ను తీసుకెళ్లడానికి మా అమ్మ లేదా నాన్న వస్తున్నారు” అని చెప్పాలని పిల్లలకు తెలియజేయడం అవసరం. ఒకవేళ ఎవరైనా బలవంతంగా మాట్లాడడానికి లేదా దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తే గట్టిగా అరుస్తూ చుట్టుపక్కల వారి సహాయం కోరాలన్న విషయాన్ని పిల్లలకు వివరంగా చెప్పాలి.

మా తల్లిదండ్రులను అడగండి

పిల్లల తమ వ్యక్తిగత సమాచారం అపరిచితులతో పంచుకోవడం కూడా ఇప్పుడున్న కాలంలో ప్రమాదకరమే. అందుకే పిల్లలు తమ పేరు, స్కూల్ పేరు, ఇంటి చిరునామా, ఫోన్ నంబర్ వంటి వివరాలను అపరిచితులతో పంచుకోకూడదు. ఎవరైనా అడిగితే “ఆ విషయాలు మా తల్లిదండ్రులను అడగండి” అని మర్యాదగా చెప్పి దూరంగా వెళ్లడం పిల్లలకు నేర్పించాలి.

అన్ని విషయాలు ఇంట్లో షేర్ చేసుకోవడం

“ఏ విషయం అయినా ఇంట్లో చెప్పొచ్చు” అనే నమ్మకాన్ని తల్లిదండ్రులు పిల్లలకు కల్పించాలి. కొందరు వ్యక్తులు “ఈ విషయం అమ్మానాన్నలకు చెప్పొద్దు” అని పిల్లలను భయపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో పిల్లలు భయపడకుండా వెంటనే తల్లిదండ్రులకు చెప్పేలా వారిలో ధైర్యం పెంచాల్సిన అవసరం చాలా ఉంది. పిల్లలు చేసిన చిన్న తప్పులకైనా అతిగా కోపపడకుండా, వారితో స్నేహపూర్వకంగా మాట్లాడే వాతావరణం ఇంట్లో ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే వారు ఎలాంటి సమస్య వచ్చినా దాచిపెట్టకుండా ఇంట్లో చెప్పగలుగుతారు.

పిల్లల భద్రత అనేది కేవలం వారిని కనిపెట్టుకుని ఉండటం మాత్రమే కాదు, ప్రమాదకర పరిస్థితుల్లో వారు స్వయంగా ఎలా రక్షించుకోవాలో నేర్పించడం. మారుతున్న నేటి సమాజంలో పిల్లలకు కేవలం మంచి విలువలను మాత్రమే కాకుండా, తమను తాము కాపాడుకునే ‘ఆత్మరక్షణ విద్య’ మరియు ‘సమయస్ఫూర్తి’ ని నేర్పించాల్సిన కనీస బాధ్యత తల్లిదండ్రులపై ఉంది.

Read Also: ఆసియన్ గేమ్స్‌పై గురిపెట్టిన ఐశ్వరీ ప్రతాప్ సింగ్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>