కలం, వెబ్ డెస్క్: 77వ గణతంత్ర దినోత్సవం (Republic Day) సందర్భంగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకల్లో గవర్నర్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ స్వాతంత్య్ర సమరయోధులకు, స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు నివాళులు అర్పించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ పాలనా విధానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రెండేళ్ల క్రితం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) అన్నారు. ప్రజా ప్రభుత్వం అతి తక్కువ కాలంలోనే గొప్ప విజయాలను సాధించిందని చెప్పారు. రెండేళ్ల పాలన సందర్భంగా ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పాలసీను ప్రవేశపెట్టిందన్నారు. ఇది ప్రధాని నరేంద్ర మోడీ ఆశించిన వికసిన భారత్ 2047 లక్ష్యంతో ప్రారంభించారని తెలిపారు. ఈ విధానంలో తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక శక్తిగా ఎదుగుతుందన్నారు. దీంతో పాటు 2047 వరకు 30 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక శక్తిగా ఎదగాలన్న భారత దేశ లక్ష్యాన్ని సాధించేందుకు తెలంగాణ సహకరిస్తుందని చెప్పారు.
గవర్నర్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Global Summit) 2025ను కూడా గుర్తు చేశారు. గత డిసెంబర్‌లో ఈ కార్యక్రమంలో వేలాది గ్లోబల్ ప్రతినిధులు పాల్గొని, రాష్ట్ర ప్రభుత్వంతో 5 లక్షల కోట్లు పైగా ఒప్పందాలు కుదిరాయని, ఇది భారీగా ఉద్యోగావకాశాలను సృష్టిస్తుందని చెప్పారు. ప్యూర్, క్యూర్, రేర్‌లతో తెలంగాణలో హైదరాబాద్ ప్రధాన పట్టణ ఆర్ధిక వ్యవస్థ, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ పెరీ అర్బన్ ఆర్ధిక వ్యవస్థ, ప్రాంతీయ రింగ్ రోడ్ దాటి గ్రామీణ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అనే మూడు స్థాయిల్లో అభివృద్ధి వ్యూహాన్ని అమలు చేస్తోందని, అన్ని రంగాల్లో దానిని విస్తృతంగా తీసుకురావాలని పేర్కొన్నారు. చరిత్రలో తొలిసారి మేడారంలో కేబినెట్ భేటీ నిర్వహించారని తెలిపారు. ధరణి స్థానంలో ప్రభుత్వం భూభారతి యాప్ తీసుకొచ్చినట్లు తెలిపారు.
Read Also: రేవంత్ సర్కారు నిర్లక్ష్యంతో మరో గురుకుల విద్యార్థి బలి : కవిత
Follow Us On : WhatsApp


