కలం, వెబ్డెస్క్: ఆర్టీసీ బస్సులు, కిరణా షాపులు, మార్కెట్లలో తరచూ ఎదురయ్యే సమస్య చిల్లర (Hybrid ATMs). దుకాణాల్లో కొన్న వస్తువుకు సరిపడ చిల్లర లేక చాలాసార్లు వినియోగదారులు సతమతమవుతుంటారు. దీంతో ఒక్కోసారి అవసరం లేనివీ కొనేస్తుంటారు. అలాగే ఆర్టీసీ బస్సుల్లో టికెట్కు కావాల్సిన తక్కువ విలువ నోట్లు, చిల్లర లేక కండక్టర్లకు, ప్రయాణికులకు తరచూ గొడవలు జరగడం తెలిసిందే. ఇలాంటి ఇబ్బందులన్నిటికీ త్వరలో తెరపడనుంది.
దేశవ్యాప్తంగా హైబ్రిడ్ ఏటీఎంలు తీసుకువచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అధిక జనాభా ప్రాంతాల్లో.. ముఖ్యంగా నగర, పట్టణ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఏటీఎంల ద్వారా కేవంల రూ.100, రూ.500 లాంటి పెద్ద నోట్లను మాత్రమే డ్రా చేయగలం. హైబ్రిడ్ ఏటీఎంల నుంచి రూ.10, రూ.20, రూ.50 నోట్లతోపాటు నాణేలను కూడా తీసుకోవచ్చు. ఈ క్రమంలో చిన్న నోట్లు, నాణేల తయారీపై ఆర్బీఐకి కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. కాగా, పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికే ముంబైలో ఈ పథకాన్ని పరీక్షిస్తున్నారు.
ఆర్థిక లావాదేవీల్లో డిజిలైజేషన్, యూపీఏ వాడకం పెరిగి చిన్న నోట్లు, నాణేలకు కొరత ఏర్పడుతుండడంతో హైబ్రిడ్ ఏటీఎంలు కొంత మేర సమస్య పరిష్కరించగలవని కేంద్రం భావిస్తోంది. వీటిని రవాణా కేంద్రాలు, మార్కెట్లు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి అధిక రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఆర్‌బీఐ చిన్న విలువ గల నోట్లు, నాణేల ముద్రణ పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం రూ.500 నోట్లే ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. అందువల్లనే మార్కెట్లు, దుకాణాలు, ప్రభుత్వ ప్రజా రవాణా వాహనాల్లో పెద్ద నోట్లకు చిల్లర ఇవ్వడంలో తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను హైబ్రిడ్ ఏటీఎం (Hybrid ATMs) లు పరిష్కరిస్తాయని భావిస్తున్నారు.


