కలం, నల్లగొండ బ్యూరో : చండూరు(Chandur) లో మరోసారి రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య మొదలైన విభేధాలు చిలికి చిలికి గాలివానలా మారాయి. ఈ క్రమంలోనే సోమవారం కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఒకరికొకరు పరస్పరం కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా చండూరు మున్సిపల్ కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మున్సిపల్ ఎన్నికల్లో ఓ వార్డు నుంచి పోటీ చేసే విషయమై.. ఇరు పార్టీల మధ్య వివాదం చేలరేగింది.
గత కొంతకాలంగా ఆ వివాదం కొనసాగుతూనే వస్తోంది. ఈ నేపథ్యంలోనే పాత కక్షలను మనసులో పెట్టుకుని ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు. కాగా, ఈ దాడిలో పలువురు బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. బీజేపీ కార్యకర్త దోటి కిరణ్ యాదవ్ తీవ్రంగా గాయపడ్డారు. దాడిలో ఆయన పన్ను విరగడంతో పాటు తలకు బలమైన గాయం అయింది. గాయపడిన వారిని వెంటనే నల్లగొండలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
‘నేను ఒకటో వార్డులో పోటీ చేశాననే అక్కసుతోనే కాంగ్రెస్ కార్యకర్తలు కావాలని పక్కా ప్లాన్‌తో దాడి చేశారు.’ అని బాధితుడు కిరణ్ యాదవ్ ఆరోపించారు. తమకు కాంగ్రెస్ శ్రేణుల నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఆయన పోలీసులను కోరారు. ఈ ఘర్షణకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో ఆధారాలను సేకరించిన పోలీసులు, దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ప్రస్తుతం చండూరులో (Chandur) ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
Read Also: గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన
Follow Us On: Facebook

