కలం, వెబ్ డెస్క్ : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు( Thorrur) లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చికిత్స కోసం వచ్చిన 21 ఏళ్ల యువతిపై డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాకు చెందిన ఓ యువతి జ్వరంతో బాధపడుతూ తొర్రూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి చికిత్స కోసం వెళ్లింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కిరణ్ కుమార్ ఆమెకు ఇంజక్షన్ ఇచ్చిన అనంతరం అసభ్యంగా ప్రవర్తించినట్టు బాధిత యువతి ఆరోపించింది.
ఈ ఘటనతో భయాందోళనకు గురైన ఆ యువతి వెంటనే తన భర్తకు వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చింది. దీంతో యువతి భర్తతో పాటు కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కి చేరుకుని డాక్టర్‌ను ప్రశ్నించారు. అయితే డాక్టర్ నిర్లక్ష్యంగా స్పందించగా.. ఆగ్రహించిన బంధువులు అతనికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

