కలం, తెలంగాణ బ్యూరో : మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ (Moinabad Drugs Case) అంశం రెండు తెలుగు రాష్ట్రాలనూ కుదిపేస్తున్నది. డ్రగ్స్ వినియోగం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి (Pilot Rohith Reddy) , ఏపీ ఏలూరు సిట్టింగ్ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ (Putta Mahesh Kumar) డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైంది. ఈ కేసు (Moinabad Drugs Case) లో రోహిత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. పుట్టా మహేశ్ కు స్టేషన్ బెయిల్ మంజూరైంది. డ్రగ్స్ మహమ్మారిపై తెలంగాణ సర్కార్ యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా ఈగల్ విభాగాన్నే ఏర్పాటు చేసింది. మాదక ద్రవ్యాల సప్లై, వినియోగం, విక్రయం లాంటివాటిల్లోని వ్యక్తులు ఎంత పలుకుబడి ఉన్నవారైనా, ఏ స్థాయిలో ఉన్నా వదిలే ప్రసక్తే లేదని ప్రారంభంలోనే సీఎం రేవంత్ హెచ్చరించారు. ఇప్పుడు పొలిటికల్ లీడర్లే డ్రగ్స్ పాజిటివ్‌గా తేలడంతో రానున్న రోజుల్లో దర్యాప్తు ఏ టర్న్ తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ :
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీలో పుట్టా మహేశ్ దొరకడంతో వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపైనా, తెలుగుదేశం పార్టీపైనా, ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఒకవైపు గొప్ప మాటలు చేబుతూ ఇలాంటి ఛండాలమైన పనులకు పాల్పడతారా?.. అంటూ ఫైర్ అవుతున్నారు. టీడీపీ అధినేత జోక్యం చేసుకోక తప్పలేదు. ఈ ఘటనపై పుట్టా మహేశ్ కుమార్‌ను వివరణ కోరుతూ నోటీసులు ఇవ్వాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను సీఎం చంద్రబాబు ఆదేశించారు. డ్రగ్స్ కేసులో ఎవరు చిక్కుకున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వ్యక్తులు, వారి బలహీనతలు, తప్పుల వల్ల పార్టీ నష్టపోయే పరిస్థితులు రావొద్దని హెచ్చరించారు. పార్టీ కార్యక్రమాలన్నింటికీ దూరంగా ఉండాలని పుట్టా మహేశ్‌కు టీడీపీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది.
రోహిత్‌రెడ్డిపై ఎటూ తేల్చని బీఆర్ఎస్ :
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ ఇష్యూలో మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి నిందితుడు కావడంతో బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఎలాంటి క్రమశిక్షణా చర్యలు ప్రారంభించలేదు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలంటూ ట్విట్టర్ ద్వారా కేటీఆర్ కామెంట్ చేశారు. డ్రగ్స్ విషయంలో పార్టీ స్పష్టమైన నిర్ణయంతో ఉన్నదన్నారు. ఈ వెలుగులో బీఆర్ఎస్ తదుపరి కార్యచరణ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ నుంచి రోహిత్‌రెడ్డిని సస్పెండ్ చేస్తుందా?.. బహిష్కరిస్తుందా?.. సంజాయిషీ నోటీసు జారీ చేస్తుందా?.. రోహిత్‌రెడ్డే తనంతట తానుగా పార్టీ నుంచి తప్పుకుంటారా?.. ఇలాంటి అనేక సందేహాలు నెలకొన్నాయి. సిట్టింగ్ ఎంపీ పుట్టా మహేశ్‌పై చంద్రబాబు చర్యలకు దిగడంతో ఇప్పుడు బీఆర్ఎస్ వైఖరిపై చర్చ మొదలైంది. నాడు అణిముత్యం అంటూ పొగిడిన రోహిత్ రెడ్డిపై ఇప్పుడు చర్య తీసుకుంటే అది కేడర్‌పై ఎలాంటి ప్రభావం పడుతుందనే చర్చలూ లేకపోలేదు. కేటీఆర్‌కు సన్నిహితుడనే అభిప్రాయమున్న నేపథ్యంలో రోహిత్ రెడ్డిపై పార్టీ వైఖరి కీలకంగా మారింది.

