కలం, వెబ్ డెస్క్ : పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (Sarfaraz Ahmed) అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సర్ఫరాజ్ అహ్మద్ (Sarfaraz Ahmed) ప్రకటన చేశారు. 2006లో దేశీయ క్రికెట్ లో అడుగుపెట్టిన సర్ఫరాజ్ అహ్మద్.. 2007 నవంబర్ లో జైపూర్ వేదికగా భారత జట్టుతో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేశారు. 2010లో టెస్టు, టీ 20 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో తొలి మ్యాచ్ ఆడారు. సర్ఫరాజ్ అహ్మద్ తన కెరీర్ లో 54 టెస్టుల్లో 3031 పరుగులు, 117 వన్డేల్లో 2315 పరుగులు, 61 టీ20 మ్యాచ్ ల్లో 818 పరుగులు చేశారు. 2017లో తన కెప్టెన్సీలో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ జట్టును విజేతగా నిలిపారు. ఫైనల్లో భారత జట్టును ఓడించి పాక్ టోర్నీ కైవసం చేసుకుంది.
అయితే, 2019లో ఇంగ్లాండ్ లో జరిగిన ప్రపంచకప్ తర్వాత పాకిస్థాన్ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సర్ఫరాజ్ తన స్థానాన్ని స్థిరంగా నిలుపుకోలేకపోయాడు. గత రెండు సంవత్సరాలుగా అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉంటున్న సర్ఫరాజ్ 2023లో తన చివరి టెస్టు మ్యాచ్.. 2021లో చివరి వైట్ బాల్ క్రికెట్ ఆడారు. సర్ఫరాజ్ తన రిటైర్ మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియాలో వెల్లడిస్తూ.. తన కెరీర్ లో అండగా నిలిచిన సహచర ఆటగాళ్లు, కోచ్ లు, కుటుంబ సభ్యులు, అభిమానులకు ధన్యవాదాలు అని చెప్పారు. 2017లో ఐసీసపీ చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న క్షణం తనకు ఎంతో ప్రత్యేకం అని ఎమోషనల్ అయ్యారు.

