కలం, నల్లగొండ: నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి, నిరుద్యోగ జేఏసీ నాయకుడు పాలకూరి అశోక్ గౌడ్ (Palakuri Ashok Goud)ను నల్లగొండ జిల్లా పోలీసులు (Nalgonda Police) అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన వివిధ ఉద్యోగ నోటిఫికేషన్లలో నిరుద్యోగుల వయో పరిమితిని 44 సంవత్సరాల నుండి 46 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేస్తూ అశోక్ గౌడ్ గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఈ డిమాండ్‌పై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఆయన వినతి పత్రాలు అందజేస్తున్నారు.
ఈ క్రమంలో నిరుద్యోగులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు ఆయన సిద్ధమవుతున్నట్లు పోలీసులకు ముందస్తు సమాచారం అందినట్లు తెలుస్తోంది. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకే ముందస్తు జాగ్రత్తగా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, పాలకూరి అశోక్ గౌడ్ (Palakuri Ashok) అరెస్ట్ లేదా అదుపులోకి తీసుకున్నారనే వార్తలపై నల్గొండ జిల్లా పోలీసు యంత్రాంగం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆయనను ఎక్కడ ఉంచారనేది కూడా గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.
Read Also: ఆ దమ్ము, పౌరుషం పొంగులేటికి ఉందా?: కేటీఆర్ సవాల్!
Follow Us On: X(Twitter)

