Mobile Popup Ad
Mobile Popup Ad

దేశానికి ఎల్ నినో టెర్రర్.. లోటు వర్షపాతం!

కలం, ఢిల్లీ బ్యూరో: ఈ సంవత్సరం ఎల్ నినో (El Nino) టెర్రర్ తీవ్రంగానే ఉండనున్నది. జూన్ ఫస్ట్ వీక్‌లో నైరుతి రుతుపవనాలు ఎంటర్ కాగా.. వారం రోజుల్లోనే వర్షపాతం సాధారణం కంటే 64% తగ్గింది. ఇకపైనా పరిస్థితి ఆశించినంతగా ఉండకపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో పరిస్థితులు బలపడుతూ ఉన్నాయని, ఈ ప్రభావం భారతదేశంమీదా భారీగా ఉంటుందని, ఆశించిన స్థాయిలో వర్షాలు ఉండవని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థికవేత్తలు ఈ ప్రమాదాన్ని మరో రూపంలో ప్రభుత్వాన్ని అలర్ట్ చేశారు. వ్యవసాయ దిగుబడి తగ్గుతుందని, ఉత్పాదకత పడిపోతుందని, ఆహార ధరలు ఆకాశాన్ని అంటుతాయని, సాగునీటితో పాటు తాగునీటికి ఇబ్బందులు తప్పవని, ఓవరాల్‌గా ఆర్థిక పరిస్థితులు దయనీయంగా ఉంటాయన్నారు.

11 సంవత్సరాల తర్వాత ఇంత భారీగా ఎల్ నినో ప్రభావం కనిపించడం ఇదే తొలిసారి. ఎల్ నినో ప్రభావంతో మేఘాలు తరలిపోతున్న శాటిలైట్ ఇమేజెస్ కలవరపరుస్తున్నాయి. అందుకే అంతర్జాతీయ వాతావరణ నిపుణులు దీన్ని ‘గాడ్జిలా ఎల్‌నినో’ (Godzilla El Nino) అని అంటున్నారు. భారత అత్యాధునిక వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్-3డీఎస్ శాటిలైట్ ఈ నెల 14, 15 తేదీల్లోని వాతావరణ చిత్రాలు తీసింది. దేశంలోని ప్రధాన భూభాగంపై మేఘాల కదలికలు పూర్తిగా తగ్గిపోయినట్లు ఇవి సూచిస్తున్నాయి. మరోవైపు భారత వాతావరణ శాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో ప్రస్తుతం ఏకంగా 64 శాతం లోటు వర్షపాతం రికార్డయింది.

భారీ వర్షపాత లోటు..

జూన్ 4 నుంచి జూన్ 15 మధ్య దేశవ్యాప్తంగా కురిసింది 19.2 మిల్లీమీటర్ల వర్షపాతమే. ఈ సమయానికి దేశంలో సాధారణ సగటు వర్షపాతం 53.7 మిల్లీ మీటర్లు మాత్రమే ఉంది. సాధారణ స్థాయి కంటే చాలా తక్కువగా వర్షాలు కురవడంతో 64 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఐఎండీ విడుదల చేసిన ‘రెయిన్‌ఫాల్ డిపార్చర్ మ్యాప్’ ప్రకారం.. మధ్య, దక్షిణ, తూర్పు భారతదేశంలోని చాలా ప్రాంతాలు పసుపు, ఎరుపు రంగుల్లో కనిపిస్తున్నాయి. ఇవి తీవ్ర వర్షాభావాన్ని లేదా కరువు పరిస్థితులను సూచిస్తున్నాయి.

షాకింగ్ విజువల్స్..

భారతదేశ అత్యాధునిక వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్-3డీఎస్ 15వ తేదీన తీసిన ఫొటోలు శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచాయి. సాధారణంగా రుతుపవనాలు చురుగ్గా ఉన్నప్పుడు దేశం మొత్తం దట్టమైన నల్లటి మేఘాలతో కమ్ముకుని ఉండాలి. కానీ.. తాజా శాటిలైట్ చిత్రాలలో దక్షిణ ద్వీపకల్పం, మధ్య భారతదేశం అంతా ఆకాశం స్పష్టంగా, మేఘాలు లేకుండా కనిపిస్తున్నది. వర్షం కురిపించే మేఘాల కదలికలన్నీ కేవలం హిమాలయ ప్రాంతాలు.. ఈశాన్య రాష్ట్రాలు, ఇండో-గాంగెటిక్ మైదానాలకు ఉత్తరంగా మాత్రమే పరిమితమై ఉన్నాయి. అరేబియా సముద్రం వైపు నుంచి వచ్చే రుతుపవనాలు బలహీనంగా, చెల్లాచెదురు అయ్యాయి.

ఎందుకు ఆగిపోయాయి?

రుతుపవనాలు ఇటీవల కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించినప్పటికీ.. వర్షాలు ఎందుకు కురవడం లేదనే దానికి వాతావరణ నిపుణులు పలు కారణాలు వివరించారు. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో వర్షాలు కురవడానికి సరిపడా తేమ ఉంది. సమస్య సముద్రంలో లేదు.. భూమికి కొన్ని కిలోమీటర్ల ఎత్తున వాతావరణంలో నెలకొన్న మార్పుల్లో ఉంది. ఎగువ వాతావరణంలో వేగంగా వీచే వెస్టర్లీ జెట్ స్ట్రీమ్ (పశ్చిమ గాలుల ప్రవాహం) సాధారణ స్థానం కంటే ఎక్కువ దక్షిణానికి జరిగాయి. ఇది రుతుపవనాల వ్యవస్థను నడిపించే ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ (తూర్పు గాలుల ప్రవాహం)తో తలపడుతున్నది. సాధారణంగా ఈస్టర్లీ జెట్ వల్ల గాలి పైకి లేచి దట్టమైన మేఘాలు.. ఉరుములతో కూడిన వర్షాలు పడతాయి.

కానీ.. ఈసారి బలమైన వెస్టర్లీ గాలులు ఈ ప్రక్రియను అణిచివేస్తున్నాయి. దీంతో సముద్రంలో ఎంత తేమ ఉన్నప్పటికీ.. వాతావరణంలో మేఘాలు ఏర్పడే పరిస్థితులు దెబ్బతిన్నాయి. దాంతో రుతుపవనాలు మ్యాప్‌లో ముందుకు కదిలినట్లు కనిపిస్తున్నా.. వర్షాలు మాత్రం పడటం లేవు. వాతావరణ నిపుణులు ఈ పరిస్థితిని మన్సూన్ పాజ్ (రుతుపవనాలకు తాత్కాలిక విరామం)గా చెప్తున్నారు. ఇది అప్పర్ అట్మాస్పియర్ డైనమిక్స్ వల్ల ఏర్పడిన తాత్కాలిక సమస్యేనని అంటున్నారు.

ఎప్పటి నుంచి పుంజుకుంటాయి?

ఈ వారం చివర్లో (జూన్ 23-24 నాటికి) ఈ వెస్టర్లీ జెట్ స్ట్రీమ్ ప్రభావం బలహీనపడే అవకాశం ఉందని వెదర్ ఫోర్‌కాస్ట్ మోడల్స్ ఆశిస్తున్నది. ఆ తర్వాత రుతుపవనాలు మళ్లీ యాక్టివ్ అవుతాయని చెప్తున్నది. అప్పుడు దేశవ్యాప్తంగా సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అప్పటివరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణమే ఉండనుంది.

లోటు వర్షపాతం

దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో సాధారణానికి దగ్గరగా వర్షాలు నమోదవుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదవుతున్నది. వ్యవసాయంపై ఆధారపడిన రాష్ట్రాల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ పంటల సాగుపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దిగుబడిపై ఎఫెక్ట్!

రుతుపవనాలపై ఆధారపడే భారత వ్యవసాయ రంగానికి ఈ పరిస్థితి సవాల్గా మారింది. విత్తనాలు వేసిన రైతులు.. వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి భారీ ఎండల కారణంగా నీటి నిల్వలు ఆవిరయ్యాయి. వర్షాభావం కొనసాగితే పంటల దిగుబడిపై ప్రభావం పడే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రాష్ట్రంలో లోటు వర్షపాతం

జూన్ 4 నుంచి జూన్ 15 మధ్య తెలంగాణలో సగటున 23 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 30 మిల్లీ మీటర్ల వర్షమే పడింది. కురవాల్సిన సాధారణ వర్షపాతం 42 మిల్లీ మీటర్లు. కొన్ని జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణం కంటే 60 నుంచి 80 శాతం తక్కువ వర్షపాతం రికార్డయింది. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మాత్రం జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలతో ప్రస్తుతానికి సాధారణ వర్షపాత గణాంకాలు నమోదయ్యాయి. జూన్ 18 నుంచి 20 మధ్య రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

Read Also:  వాటర్ బార్ కల్చర్.. లీటర్ నీళ్లకు వేల రూపాయలు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>