కలం, వెబ్ డెస్క్ : ‘స్వయంవరం’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నటి లయ (Actress Laya) తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘ప్రేమించు’, ‘మనసున్న మారాజు’, ‘హనుమాన్ జంక్షన్’, ‘శివరామరాజు’, ‘మిస్సమ్మ’ వంటి విజయవంతమైన సినిమాల్లో నటించారు. అయితే హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే లయ పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయారు. అక్కడ కుటుంబంతో స్థిరపడిన ఆమె (Actress Laya) చాలా సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నారు. పిల్లలు పెద్దవాళ్లు కావడంతో మళ్లీ భారత్ కు తిరిగి వచ్చి సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేశారు. ఆమె నటుడు శివాజీతో కలిసి ఆమె ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూస’ అనే సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. థియేటర్లలో ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది.
ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లయ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనలాగే తన కూతురు శ్లోకకు కూడా నటనపై చాలా ఆసక్తి ఉందని.. ఛాన్స్ వస్తే తెలుగులో హీరోయిన్ గా నటించేందుకు సిద్ధంగా ఉందని లయ చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఆమె కళలపై మంచి పట్టు సాధిస్తోందని తెలిపారు. శ్లోక గతంలో రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంథోని’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిందన్నారు. సరైన స్టోరీ, మంచి అవకాశం వస్తే తప్పకుండా తన కూతురిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తానని స్పష్టం చేశారు. మరి ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో చూడాలని వ్యాఖ్యానించారు. ఈ విషయం తెలిసి ‘జూనియర్ లయ’ రాబోతుందని లయ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

