కలం, మహబూబ్ నగర్ బ్యూరో: రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో వేల ఎకరాల సాగుకు రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (Rajolibanda Diversion Scheme) కీలక ఆధారం. కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని తుంగభద్ర నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టు అంతర్రాష్ట్ర నీటిపారుదల వ్యవస్థలో అత్యంత ముఖ్యమైనది. కర్నాటకలోని రాయచూర్లో హెడ్ వర్క్స్ ఉన్నప్పటికీ.. దీని కింద రాయచూర్తో పాటు తెలంగాణలోని జోగులాంబ గద్వాల, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలు లబ్ధి పొందుతున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా గద్వాల జిల్లాలోని దాదాపు 87,500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. నడిగడ్డ ప్రాంత రైతాంగానికి వరప్రదాయిని అయిన ఆర్డీఎస్.. నేడు ఆధునీకరణ పనులు, రిజర్వాయర్ల నిర్మాణంలో జాప్యం కారణంగా ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు, పాలకుల నిర్లక్ష్యం వల్ల లక్షలాది ఎకరాల ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదం పొంచి ఉంది.
అసలేంటీ ప్రాజెక్టు?
అప్పటి నిజాం ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కరువు ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం ఎడమ కాలువ ద్వారా తెలంగాణకు 15.9 టీఎంసీల నికర జలాలు దక్కాలి. జోగులాంబ గద్వాల్ జిల్లా పరిధిలోని అలంపూర్, గద్వాల్ నియోజకవర్గాల్లోని దాదాపు 87,500 ఎకరాలకు ముఖ్యంగా ఐజ, వడ్డేపల్లి, మానవపాడు, ఇటిక్యాల మండలాల్లోని 75 గ్రామాలకు సాగునీరు అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. అయితే, ఆర్డీఎస్ హెడ్వర్క్స్ (ఆనకట్ట) కర్నాటకలోని రాయచూర్ జిల్లాలో ఉంది. కాలువ మొదటి 42 కిలోమీటర్లు కర్నాటకలోనే ప్రవహిస్తుంది. అక్కడ పైభాగంలో ఉన్న కర్నాటక రైతులు అక్రమంగా వందలాది హైపవర్ మోటార్లు పెట్టడం, కాలువకు గండ్లు కొట్టడం వల్ల తెలంగాణ సరిహద్దు దాటేసరికే నీరు సగమైపోతోంది. తెలంగాణకు దక్కాల్సిన 15.9 టీఎంసీలలో కేవలం 5 నుండి 6 టీఎంసీలు మాత్రమే అందుతున్నాయి. మరోవైపు, కర్నూలు జిల్లా కోసం ఏపీ చేపడుతున్న ఆర్డీఎస్ కుడి కాలువ పనులు చట్టవిరుద్ధమని తెలంగాణ వాదిస్తున్నది. ఈ కారణాల వల్ల కాలువ చివరి భాగంలో ఉన్న అలంపూర్ ప్రాంత ఆయకట్టు దశాబ్దాలుగా ఎడారిగా మారుతున్నది.
ఇప్పటివరకు ఏం చేశారంటే..?
ఆర్డీఎస్ కాలువ ద్వారా నీరు రాక ఎండిపోతున్న గద్వాల జిల్లాలోని ఆయకట్టును కాపాడేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టింది. కృష్ణా నది బ్యాక్వాటర్ (సుంకేసుల బ్యారేజీ ఎగువన) నుంచి నీటిని లిఫ్ట్ చేసి ఆర్డీఎస్ కాలువకు మళ్లించే పనుల్లో మొదటి విడత (స్టేజ్-1) పూర్తి చేసి, కొంతవరకు ఆయకట్టుకు తాత్కాలిక ఉపశమనం కల్పించారు. గతంలో ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునికీకరణ కోసం, ఆనకట్టపై గండ్లు పడకుండా కాంక్రీట్ గోడ ఎత్తును 15 సెంటీమీటర్లు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం తన వాటా నిధులను కర్నాటక ప్రభుత్వానికి డిపాజిట్ చేసింది. తెలంగాణ పరిధిలోకి కాలువ ప్రవేశించిన తర్వాత (42 కి.మీ తదుపరి) ఉన్న కాలువలకు కొంతమేర సిల్ట్ (మట్టి) తీసే పనులు, అంతర్గత లైనింగ్ పనులు పూర్తి చేశారు.
ఇంకేం పూర్తికావాలి?
కేవలం నది నుంచి నీటిని నేరుగా లిఫ్ట్ చేస్తే వరద రోజుల్లో మాత్రమే నీరందుతుంది. అందుకే ఏడాది పొడవునా నీరివ్వడానికి వీలుగా తుమ్మిళ్ల స్టేజ్-2 లో భాగంగా ప్రతిపాదించిన మూడు రిజర్వాయర్ల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాల్సి ఉంది. కర్నాటక భూభాగంలో ఉన్న మొదటి 42 కిలోమీటర్ల కాలువకు పూర్తిగా కాంక్రీట్ లైనింగ్ (లింక్ ఛానల్ పనులు) జరగాలి. అక్కడ జరుగుతున్న అక్రమ నీటి తోడివేతను అడ్డుకోవడానికి కర్నాటక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సంయుక్త రక్షణ, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఏపీ అక్రమ పనులను అడ్డుకోవడంతో పాటు, ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ నియంత్రణను పూర్తిగా కేఆర్ఎంబీ బోర్డు తన ఆధీనంలోకి తీసుకోవాలని తెలంగాణ గట్టిగా డిమాండ్ చేస్తున్నది.
మల్లమ్మ కుంట పరిస్థితి ఇలా..
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో మల్లమ్మ కుంట రిజర్వాయర్ పాత్ర కీలకం. తుమ్మిళ్ల పథకం ద్వారా సాగునీటిని అందించే లక్ష్యంతో రాజోలి మండలంలో మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణాన్ని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ రిజర్వాయర్ పూర్తయితే నదిలో వరదలు ఉన్నప్పుడు నీటిని తీసుకోవడంతో పాటు, వర్షపు నీటిని కూడా నిల్వ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. మల్లమ్మ కుంట ద్వారా ఆర్డీఎస్ కాలువ చివరి ఆయకట్టు వరకు నీరందించవచ్చని అధికారులు ముందు నుంచే భావిస్తున్నారు. మొదటి విడత పనులు పూర్తయినప్పుడే మల్లమ్మ కుంట నిర్మాణాన్ని చేపట్టి ఉంటే, ఈపాటికి పనులు పూర్తయ్యేవి. కానీ, పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో ఈ రిజర్వాయర్ నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. గతంలో అప్పటి జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ మల్లమ్మ కుంట నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి, పనులు ప్రారంభించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు రిజర్వాయర్‌కు సంబంధించి పెగ్ మార్కింగ్ పనులు పూర్తయ్యాయి.

