కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలో ఇరవై లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన తర్వాతనే ప్రజలను ఓట్లు అడుగుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్, మంత్రి పొంగులేటిని లక్ష్యంగా చేసుకుని ఘాటు విమర్శలు చేశారు. గత రెండున్నరేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం 10 లక్షల ఇళ్లయినా కట్టించిందా అని ప్రశ్నించారు. “20 లక్షల ఇళ్లు కట్టకపోతే ఓట్లు అడగమనే మాట మీద నిలబడే దమ్ము, పౌరుషం మంత్రి పొంగులేటికి ఉందా?” అని కేటీఆర్ సవాలు విసిరారు. కేవలం ప్రగల్భాలు పలకడం కాదు, చేతనైతే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
ఆ 20 లక్షల ఇళ్లను ప్రభుత్వం తన సొంత నిధులతో కడుతుందా? లేక అడ్డదారుల్లో సంపాదించిన సొమ్ముతో కడతారా? అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పేదల ఆత్మగౌరవం ఉట్టిపడేలా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఇటుక ఇటుక పేర్చి నిర్మించామని, తాము కట్టిన ఒక్కో ఇల్లు ఏడు ఇందిరమ్మ ఇళ్లతో సమానమని పేర్కొన్నారు. తాము పేదలకు ఇళ్లు కట్టి ఇస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పేదల ఇళ్లపై బుల్డోజర్లు ఎక్కించి కూల్చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్ని డైవర్షన్ డ్రామాలు ఆడినా, ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, హామీల ఎగవేతపై ప్రజల పక్షాన నిలదీస్తూనే ఉంటామని కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు.
ఆ దమ్ము, పౌరుషం పొంగులేటికి ఉందా?: కేటీఆర్ సవాల్!

