Mobile Popup Ad
Mobile Popup Ad

రాజధాని చుట్టూనే రాజకీయం..!

కలం, తెలంగాణ బ్యూరో: డీలిమిటేషన్‌ (Delimitation)పై ఆర్థిక సలహా మండలి రూపొందించిన ఫార్ములా ఇప్పుడు తెలంగాణలోని పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఈ ఫార్ములాను కేంద్ర ప్రభుత్వం యధాతథంగా ఆమోదిస్తుందా?.. లేక మార్పులు చేస్తుందా?.. అనే అంశంపై ఇప్పటికింకా క్లారిటీ లేదు. కానీ ఆ ప్రకారమే లోక్‌సభ సీట్లు పెరిగితే పార్టీల భవిష్యత్తుపై పడే ప్రభావం మీద లీడర్లు లెక్కలేసుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 17 ఎంపీ స్థానాలుండగా ఆర్థిక సలహా మండలి ఫార్ములా ప్రకారం కొత్తగా తొమ్మిది నియోజకవర్గాలు ఏర్పడనున్నాయి. దీంతో మొత్తం ఎంపీ సీట్ల సంఖ్య 26కు చేరుతుంది. కొత్తగా వచ్చే స్థానాలన్నీ హైదరాబాద్ (Hyderabad) నగరంలో, శివారు ప్రాంతాల్లోనే ఉండనున్నాయి. ఆ ప్రకారం సిటీలో, చుట్టుపక్కల రీజినల్ రింగ్ రోడ్ లోపల ఉన్న ‘క్యూర్’, ‘ప్యూర్’ ప్రాంతంలోనే 16 ఎంపీ సీట్లు కేంద్రీకృతం కానున్నాయి. వాటిని ఏ పార్టీ ఎక్కువ దక్కించుకుంటుందో ఆ పార్టీకి కేంద్రంలో అంత వెయిట్ దక్కనుంది.

ప్రస్తుతం ఐదారు లోక్‌స‌భ‌ నియోజకవర్గాలు మాత్రమే హైదరాబాద్ సిటీలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి. మిగిలినవన్నీ రూరల్ ఏరియాలో కేంద్రీకృతమయ్యాయి. అందువల్ల పార్టీల రాజకీయాలన్నీ వ్యవసాయం, కులాల చుట్టూ తిరిగాయి. ఇప్పుడు ఆర్థిక సలహా మండలి ఇచ్చిన‌ రిపోర్ట్ ప్రకారం డీలిమిటేషన్ జరిగితే.. 16 ఎంపీ సీట్లు (60 శాతానికి పైగా) అర్బన్ పరిధిలోనివే కానున్నాయి. దీంతో పార్టీల ఎజెండా, కేంద్రీకరణ డిఫరెంట్‌గా ఉండనుంది. పొలిటికల్ పవర్ సెంటర్ అర్బన్, మెట్రో ప్రాంతానికి పరిమితం కావడంతో పార్టీల ప్రాధాన్యం కూడా ఇటువైపే తిరుగనుంది. దీంతో డెవలప్‌మెంట్, రోడ్లు, రైల్వే, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, సిటిజెన్ సర్వీసెస్, ట్రాఫిక్, కాలుష్యం, రియల్ ఎస్టేట్, పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ఆకర్షణ… ఇలాంటి అంశాలకు ప్రయారిటీ పెరుగుతుంది. దానికి తగినట్లుగానే పార్టీలు వాటి మేనిఫెస్టోలో హామీలు కూడా ఆ మేరకు గుప్పించే అవకాశం ఉంది.

– కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌, మజ్లిస్ పార్టీలు ఎవరికెంత లాభమనే లెక్కల్లో ఇప్పటి నుంచే నిమగ్నమయ్యాయి. ప్రధాన పార్టీల లీడర్లు కొన్నిరోజులుగా ఈ ఏరియాలను చుట్టివస్తున్నారు. బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
– ఆర్థిక సలహా మండలి ఫార్ములా కేవలం తొమ్మిది కొత్త ఎంపీ స్థానాలు పెరిగే అంశానికే పరిమితం కాదు.. తెలంగాణ పొలిటికల్ ముఖచిత్రాన్నే మార్చే పరిణామమని లీడర్లు బలంగా నమ్ముతున్నారు.
– ఫార్ములా అమలైతే.. కొత్త ఎజెండా, కొత్త వ్యూహాలు ఉనికిలోకి వస్తాయి. ప్రత్యర్థి పార్టీల బలాబలాలు, ప్రచారంలో వాడుకునే అంశాలకు అనుగుణంగా అవి రూపొందుతాయి.

పల్లె నుంచి మెట్రోకు రాజకీయం

– ఆర్థిక సలహా మండలి ప్రతిపాదించిన డీలిమిటేషన్ ఫార్ములా ప్రకారం… తొమ్మిది కొత్త ఎంపీ స్థానాలు హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్, నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోనే ఏర్పడనున్నాయి. ఇప్పుడున్న ఈ ఐదు నియోజకవర్గాలు 14 అవుతాయి.
– ఆ 14 స్థానాలకు తోడు ఇప్పటికే ఉన్న భువనగిరి, చేవెళ్ల కూడా పాక్షికంగా హైదరాబాద్‌ను ఆనుకునే ఉండడంతో పార్టీల భవిష్యత్తును ఈ మొత్తం 16 సీట్లు నిర్ణయించనున్నాయి.
– ఆర్థిక సలహా మండలి ఫార్ములా అమలైతే రాష్ట్ర రాజకీయాల్లో గణనీయమైన మార్పులే చోటుచేసుకుంటాయి. రాజకీయాల కేంద్రం పల్లె నుంచి మెట్రోకు షిఫ్ట్ అవుతుంది.

పుష్కరకాలంగా మారుతున్న బలాబలాలు

2014 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు మొదలు తాజాగా ముగిసిన ఎన్నికల వరకు పార్టీల గ్రాఫ్‌లో చాలా తేడాలే వచ్చాయి. కాంగ్రెస్, బీజేపీ గ్రాఫ్ పెరుగుతుండగా బీఆర్ఎస్ డీలా పడింది. మజ్లిస్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నది. పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల ఓట్ షేర్ గణనీయంగా మారుతున్నది. కారణం ఆయా పార్టీల ఎజెండాలు, ఓటర్ల మైండ్‌సెట్ రాష్ట్రానికి, కేంద్రానికీ వేర్వేరుగా ఉండడమే. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య ముఖాముఖి పోటీ ఉంటుండగా.. పార్లమెంటు ఎన్నికల్లో అది త్రిముఖ పోటీగా మారుతున్నది. రాష్ట్రంలో ఏ పార్టీకి అధికారం అప్పజెప్పాలో, కేంద్రంలో దేనికి ఇవ్వాలో ప్రజల్లో స్పష్టమైన అభిప్రాయాలు ఓట్ల రూపంలో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా హైదరాబాద్ నియోజకవర్గం మజ్లిస్ పార్టీకి కంచుకోటలా ఉంటున్నది. సికింద్రాబాద్ మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ తరహాలో మారిపోయింది.

కాంగ్రెస్ పట్టు సాధిస్తుందా?

– ఆర్థిక సలహా మండలి సూచించిన డీలిమిటేషన్ ఫార్ములా కాంగ్రెస్‌కు అవకాశమా లేక సవాలా అన్నది ఆసక్తికర అంశం.
– 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెల్చుకుని రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటికీ.. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు సీట్లు దక్కలేదు.
– 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ తన పట్టును నిలుపుకున్నది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదు. ఇక్కడి ఐదు ఎంపీ సీట్లలో ఒక దాంట్లో (హైదరాబాద్) మజ్లిస్ గెలవగా.. మిగిలిన నాలుగు (సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్, చేవెళ్ల) బీజేపీ చేజిక్కించుకున్నది. అటు అసెంబ్లీలో, ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో సిటీలోనూ, శివారు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్‌కు పట్టు లేకుండాపోయింది.
– ఈసారి డీలిమిటేషన్‌తో ఆర్థిక సలహా మండలి ఫార్ములా అమలైనట్లయితే దాదాపు 16 నియోజకవర్గాలు క్యూర్, ప్యూర్ పరిధిలో ఉంటున్నందున కాంగ్రెస్ చాలా శక్తినే వెచ్చించాల్సి ఉంటుంది. రూరల్‌లో పట్టు ఉన్న కాంగ్రెస్ పార్టీ.. అర్బన్, మెట్రో, కాస్మోపాలిటన్ మైండ్‌సెట్‌కు తగ్గట్టు సీట్లు గెల్చుకోడానికి ప్రత్యేకమైన వ్యూహం అనివార్యం కానున్నది.

బీజేపీ అర్బన్ అడ్వాంటేజ్ కొనసాగేనా?

– 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి, హైదరాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీల మధ్య త్రిముఖ పోటీ కనిపించింది.
– ఆరు నెలల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తన ఓటు శాతాన్ని గణనీయంగా పెంచుకుంది. మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, మెదక్ పరిసర ప్రాంతాల్లో పట్టణ మధ్యతరగతి, యువ ఓటర్లు, వలస కుటుంబాల్లో ఆదరణ ఉన్నట్లు ఫలితాల ద్వారా వెల్లడైంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలు బీజేపీకి వ్యూహాత్మకంగా అనుకూలించే అంశం.
– దేశంలోని ఫలితాలను విశ్లేషిస్తే అర్బన్ నియోజకవర్గాల్లో ఎక్కువగా బీజేపీ బలపడినట్లు స్పష్టమవుతున్నది. విద్యావంతులు, ఉద్యోగులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నివసిస్తున్న కుటుంబాలు, జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఉన్న ఓటర్లు అధికంగా ఉండటం కారణంగా బీజేపీ అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలున్నాయి.
– 2024 ఫలితాల ఆధారంగా పరిశీలిస్తే ఇకపైన కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలు అర్బన్, సెబీ-అర్బన్ స్వభావంతో కూడినవి కావడంతో బీజేపీ అదనపు ఎంపీ స్థానాలను గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బీఆర్ఎస్‌ పునరుజ్జీవమా.. ప్రతికూలమా?

– 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీచినా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. అర్బన్ డెవలప్‌మెంట్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ క్రెడిట్ అంతా బీఆర్ఎస్ ఖాతాలో పడింది.
– అయితే.. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఈ ఏరియాలో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్‌కు దక్కలేదు. గుండు సున్నా అనే విమర్శలను ఇప్పటికే ఎదుర్కొంటున్నది. ఆ తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది.
– క్యూర్, ప్యూర్ పేరుతో హైదరాబాద్, శివారు ప్రాంతాలపై కాంగ్రెస్ ఫోకస్ పెంచింది. మెట్రో రైల్ విస్తరణ, ఆక్రమణల తొలగింపు, ఫ్యూచర్ సిటీ ఏర్పాటు, నిరుద్యోగులకు నియామక పత్రాలు.. ఇలాంటి అంశాలతో పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఏరియాల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీకి దూరమైనందున ఇది కూడా గులాబీ పార్టీకి ప్రతికూల ప్రభావం చూపే అవకాశమున్నది.
– ఇంతకాలం ద్విముఖ పోటీకి పరిమితమైన బీఆర్ఎస్ ఈసారి ఏకకాలంలో బీజేపీ, కాంగ్రెస్‌తో ఢీకొట్టాల్సి ఉంటుంది. దీన్ని గుర్తించినందునే పార్టీని కాపాడుకోవడం, మరింత బలోపేతం చేయడంపై కేటీఆర్ ఫోకస్ పెట్టారన్నది బీఆర్ఎస్ కేడర్ భావన.

మజ్లిస్ ఇక పాతబస్తీకే పరిమితమా?

– దాదాపు మూడున్నర దశాబ్దాలుగా హైదరాబాద్ స్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్న మజ్లిస్ పార్టీకి ఆ సీటుపై ఎలాంటి ఆందోళనా లేదు. కానీ ఇప్పుడు అది మూడు ముక్కలు అవుతుందని ఆర్థిక మండలి డీలిమిటేషన్ ఫార్ములా ప్రతిపాదించడంతో సరిహద్దులు ఎలా మారుతాయన్నది ఆసక్తికరంగా మారింది.
– ఎలాగూ పాతబస్తీ ప్రాంతంలో మజ్లిస్‌కు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి పోటీ లేదు. కానీ, మూడు ముక్కలైన తర్వాత ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో మతపరమైన ఓటు బ్యాంక్ ఎలా కన్సాలిడేట్ అవుతుంది, పోలింగ్ సమయంలో ఎలా పోలరైజ్ అవుతుంది.. అనే అంశాలపై ఆధారపడి మజ్లిస్ హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమవుతుందా.. లేక కొత్తగా ఉనికిలోకి వచ్చే ఎంపీ సెగ్మెంట్లలోనూ ప్రభావవంతంగా ఉంటుందా అనేది తేలాల్సి ఉన్నది.
– ప్రస్తుతం హైదరాబాద్ ఎంపీ సెగ్మెంట్‌లోని హిందు ఓట్లు, వివిధ రాష్ట్రాలకు చెందినవారి నివాసం.. ఇవన్నీ డీలిమిటేషన్ ప్రక్రియలో సరిహద్దుల మార్పుతో కీలకంగా మారనున్నాయి.

రాజకీయ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం..

అసెంబ్లీ ఎన్నికలు :

సంవత్సరం      బీఆర్ఎస్      బీజేపీ      కాంగ్రెస్       మజ్లిస్

2014              34.15%      4.13%   11.71%    1.52%
2018              46.87%      6.98%   28.43%    2.71%
2023              37.62%      14.00%  39.69%    2.23%

పార్లమెంట్ ఎన్నికలు :

సంవత్సరం        బీఆర్ఎస్      బీజేపీ       కాంగ్రెస్        మజ్లిస్

2014               14.03%       8.52%     11.62%     1.50%
2019               41.71%       19.65%    29.75%    2.80%
2024               16.70 %      35.35%    40.40%    3.02%

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>