కలం, వెబ్ డెస్క్ : ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా మరిన్ని నిత్యావసర సరుకుల సరఫరాకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) తెలిపారు. 2025-26 రబీ సీజన్ ధాన్యం కొనుగోలుకు పౌర సరఫరా శాఖా రూపొందించిన ప్రణాళికలపై గురువారం బేగంపేట ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ బిల్డింగ్ లో జరిగిన సమీక్ష సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్ లో ధాన్యం దిగుబడితో పాటు కొనుగోళ్లలోనూ తెలంగాణ దేశ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసిందన్నారు. గడిచిన 25 సంవత్సరాల వ్యవధిలో ఇదే అత్యధిక రికార్డ్ అని గుర్తుచేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల వ్యవధిలో అనుసరించిన విధానాల ఫలితమే ధాన్యం దిగుబడి, కొనుగోలులోనూ సంచలనాత్మక రికార్డ్ నమోదు చేసుకుందని తెలిపారు. పౌరసరఫరాల శాఖా, నీటిపారుదల, వ్యవసాయ శాఖలు పరస్పరం సమన్వయం చేసుకోవడంతో పాటు తెలంగాణా రైతాంగం భాగస్వామ్యంతోనే ఇంతటి విజయం సాధించామన్నారు. 2020-21 లో నమోదు అయిన 70.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు రికార్డ్ ను అధిగమించి.. ఖరీఫ్ సీజన్ లో 71.64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి దేశ చరిత్రలోనే కొత్త అధ్యాయం సృష్టించిందని వివరించారు.
గ్లోబల్ మార్కెట్లకు బియ్యం ఎగుమతికి ప్రణాళికలు :
మద్దతు ధర తో పాటు సన్నాలకు మొదటిసారిగా తెలంగాణా ప్రభుత్వం అందిస్తున్న బోనస్ తో కలిపి మొత్తం 18,532.98 కోట్ల రూపాయలను 14.20 లక్షల మంది రైతులకు చెల్లించామని తెలిపారు. ధాన్యం కొనుగోలు సమయంలో పౌర సరఫరాల శాఖ సిబ్బంది పని తీరును మంత్రి ఉత్తమ్ ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ బియ్యానికి అంతర్జాతీయ మార్కెట్ లో ఉన్న డిమాండ్ ను పట్టి విదేశాలకు ఎగుమతి చేసేందుకు విధి విధానాలను రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న ధాన్యాన్ని పండించేందుకు రైతులను ప్రోత్సహించేందుకు ప్రోత్సాహకాల ఆవశ్యకతను ఆయన వివరించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ. 38,000 కోట్లను నేరుగా రైతుల ఖాతాలో జమ చేయడం కుడా ఒక అరుదైన రికార్డే అని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందన్నారు. సన్నబియ్యం పంపిణీ మీద రూ. 13,650 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు మంత్రి ఉత్తమ్ తెలిపారు.
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సీజన్ కు సీజన్ కు పెరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా నిల్వ చేసేందుకు మౌలిక సదుపాయాల ఆధునీకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని వెల్లడించారు. కేంద్రప్రభుత్వం సహకారంతో పాటు ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ధాన్యం నిలువ ఉంచే గోదాములను సైలో పద్దతిలో ఆధునికరించేందుకు ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు పాటించిన మిల్లర్లకు సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని, తప్పిదాలకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
డిఫాల్ట్ అయిన మిల్లులకు ధాన్యం కేటాయింపు ప్రసక్తే లేదని, పౌర సరఫరాల శాఖ రూపొందించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. పెరుగుతున్న ధాన్యం ఉత్పత్తికనుగుణంగా ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్రంలో మిల్లుల పరిశ్రమని ప్రోత్సహించే విధంగా విధివిధానాలను త్వరలో ప్రకటించనున్నట్లు మంత్రి ఉత్తమ్ (Minister Uttam) ప్రకటించారు.
Read Also: రెండేళ్లైనా రేవంత్ తీరు మారలే : చిరుమర్తి లింగయ్య
Follow Us On: X(Twitter)


