epaper
Thursday, January 22, 2026
spot_img
epaper

సిరిసిల్లలో బీఆర్ ఎస్ కు తేడా కొడుతోందా..?

కలం, వెబ్ డెస్క్ : సిరిసిల్ల అంటేనే బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కు కంచుకోట. గత బీఆర్ ఎస్ హయాంలో అక్కడ ఏ ఎన్నికలు జరిగినా బీఆర్ ఎస్ కే మెజార్టీ స్థానాలు దక్కేవి. అయితే మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ అనుకున్న స్థాయిలో సీట్లు సాధించలేకపోయింది. కాంగ్రెస్, బీజేపీ ఖాతాల్లో చాలా గ్రామాలు పడ్డాయి. సిరిసిల్ల నియోజకవర్గంలో ఎక్కువ స్థానాలు బీఆర్ ఎస్ నాయకులే గెలిచినా.. కేటీఆర్ కంచుకోటలో కాంగ్రెస్ పార్టీకి అనూహ్యంగా మంచి స్థానాలు దక్కాయి. దీంతో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ లో కొంత అనుమానాలు మొదలైనట్టు తెలుస్తోంది. అందుకే కేటీఆర్ ఎక్కువగా సిరిసిల్లలో పర్యటిస్తున్నారు.

కవిత ఎఫెక్ట్..

జిల్లాలో సిరిసిల్ల (Sircilla), వేములవాడ (Vemulawada) మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ రెండింటిలో కాంగ్రెస్, బీజేపీ బలమైన పోటీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి. బలాబలాలను బేరీజు వేసుకున్న కేటీఆర్.. తన జిల్లాలో పార్టీకి మున్సిపల్ చైర్మన్ స్థానాలు దక్కకపోతే తన ఇమేజ్ కు డ్యామేజ్ తప్పదని భావిస్తున్నారు. పైగా ఈ మధ్య తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జిల్లాల్లో పర్యటించిన తర్వాత.. బీఆర్ ఎస్ కేడర్ కొంత అటువైపు చూస్తున్నారనే ప్రచారం ఉంది. ఇప్పటికే బీఆర్ ఎస్ సెకండ్ గ్రేడ్ నాయకులు కొందరు తెలంగాణ జాగృతిలో చేరారు. తెలంగాణ జాగృతి తరఫున జిల్లాలోని రెండు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొందరు రెడీ అవుతున్నారు. వీళ్లు బీఆర్ ఎస్ ఓట్లనే చీలుస్తారనే టెన్షన్ గులాబీ పార్టీలో ఉంది.

కాంగ్రెస్ బలమైన పోటీ..

అటు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి.. ఆ పార్టీని ఢీకొట్టడం కష్టమే అని కేటీఆర్ అంచనా వేస్తున్నారంట. కేటీఆర్ సొంత ఇలాకాలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని అధిష్టానం బలంగా ప్రయత్నిస్తోంది. సర్వేలు చేయించి గెలిచే వారికే టికెట్లు ఇవ్వాలని ప్రయత్నిస్తోంది. రెబల్స్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంకోవైపు బీజేపీ అర్బన్ ఓట్లను తన ఖాతాలో వేసుకోడానికి రెడీ అవుతోంది.

మూడు వైపుల నుంచి..

ఇలా మూడు వైపుల నుంచి బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఎదురవుతోంది. అందుకే తన జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో కచ్చితంగా మెజార్టీ సీట్లు సాధించి.. తన పట్టును నిలపుకోడానికి గత రెండు, మూడు నెలలుగా కేటీఆర్ జిల్లాలో పర్యటిస్తూ రివ్యూ మీటింగులు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్ల జిల్లాను రద్దు చేయాలని చూస్తోందనే ప్రచారాన్ని తెరమీదకు తెచ్చినట్టు సమాచారం. ఎన్నికలు ప్రారంభం అయ్యే లోపు సిరిసిల్లలో మరిన్ని పర్యటనలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కేటీఆర్ (KTR) సొంత జిల్లాలో మున్సిపల్ స్థానాలను క్వీన్ స్వీప్ చేస్తారా లేదా అనేది చూడాలి.

Read Also:  రేషన్​ షాపుల్లో నిత్యావసర సరుకులు : మంత్రి ఉత్తమ్​

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>