కలం, ఖమ్మం బ్యూరో : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహిస్తున్న 125 మందిని కల్లూరు ఏసీపీ (Kalluru ACP) వసుంధర యాదవ్ బైండోవర్ చేశారు. రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టీ, విస్తృత తనిఖీలు నిర్వహించి కోడి పందేలకు అడ్డుకట్ట వేశారు.
మొత్తం 26 కేసుల్లో లక్షకు పైగా నగదు, 60 మోటారు సైకిళ్లు, 18 కోడి పుంజులు, 37 సెల్ ఫోన్లు, కోళ్లకు కట్టే కత్తులు, బెట్టింగ్ స్లిప్పులు, జూదానికి సంబంధించిన ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కల్లూరు ఏసీపీ (Kalluru ACP) మాట్లాడుతూ, ఎవరైనా అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.


