కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రైజింగ్ బృందం (Telangana Rising Team) దావోస్ పర్యటన (Davos Tour) విజయవంతంగా ముగిసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మూడు రోజుల పాటు జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు – 2026 కు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని బృందం హాజరైంది. దావోస్ పర్యటనలో ఆశించిన ఫలితాలు సాధించినట్లు పేర్కొంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.
CM Revanth Davos Tour | ఏఐ, సస్టైనబిలిటీ, స్కిల్లింగ్ కార్యక్రమాలకు సంబంధించిన పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన రెండు కీలక సెషన్లలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా రేవంత్ చేసిన ప్రసంగం, హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫాలో అప్ ఫోరమ్ నిర్వహించాలనే ప్రతిపాదనకు సానుకూల స్పందన వచ్చినట్లు తెలిపింది. మూడు రోజుల్లో ప్రపంచ స్థాయి ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక దిగ్గజాలతో 12 ముఖాముఖి సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు.
గత నెల (డిసెంబర్) లో హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించిన తరుణంలో దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులోనూ మెరుగైన పెట్టుబడులు, ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు దావోస్ లో కార్యక్రమాలు ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడి నుంచి అమెరికా పర్యటనకు బయల్దేరారు. అమెరికా యూనివర్సిటీల్లో జరిగే లీడర్ షిప్ తరగతులకు సీఎం హాజరవుతారు. అలాగే, సీఎం రేవంత్ రెడ్డి వెంట వెళ్లిన మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దావోస్ నుంచి ఇండియాకు తిరుగుపయనమయ్యారు.


