కలం, వెబ్ డెస్క్: పార్టీలతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రముఖ నేతలందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender) అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరితోనైనా ఫోన్లు మాట్లాడాలంటే వందసార్లు ఆలోచించాల్సి వస్తోందని చెప్పారు. అసలు రాష్ట్రంలో ఎంతమంది ఫోన్లు ట్యాప్ అయ్యాయో తెలియడం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్(Phone Tapping)తో స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ ప్రజలను ఇబ్బందులకు గురి చేసే పనులు చేయరాదని అభిప్రాయపడ్డారు. ప్రజా వ్యతిరేక పనులకు పాల్పడే ఏ ప్రభుత్వం నిలువదన్నారు. గత ప్రభుత్వ హయాంలో పలువురి వ్యక్తిగత విషయాల్లో తలదూర్చి వారి ప్రైవసీకి భంగం కలిగించారని ఆరోపించారు. ఇలాంటి పనులకు పాల్పడ్డ వారిని గుర్తించేందుకు సిట్(SIT) చర్యలు చేపట్టిందని వెల్లడించారు.


