తెల్లబంగారం సాగు దళారుల పాలు.. నడిగడ్డలో పత్తి విత్తన రైతులు విలవిల!

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా తెలంగాణ రైతుల స్థితిగతులు మారడం లేదు. రైతు కుటుంబాల నుంచి పాలకులుగా ఎదిగినా, రైతుల కష్టాలు మాత్రం పట్టించుకోవడం లేదు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక చేసిన అప్పులు తీర్చే మార్గం లేక తనువులు చాలిస్తున్నారు. విత్తనం నుంచి పంట అమ్మే వరకు దళారుల చేతిలో మోసపోతూనే ఉన్నారు. తెల్ల బంగారంగా పిలిచే పత్తి పంటను తెలంగాణలో విస్తారంగా సాగు చేస్తున్నారు. వాణిజ్య పంటగా పేరుగాంచిన పత్తిని పండించేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. రైతుల ఆసక్తిని ఆసరాగా చేసుకుని కొంతమంది దళారుల అవతారమెత్తి రైతాంగాన్ని మోసం చేస్తున్నారు. తెలంగాణలోనే పత్తి సీడ్ హబ్‌గా జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా పెరుగాంచింది. సుమారు 50 వేల ఎకరాల్లో 35 సంవత్సరాలుగా పత్తి విత్తనాల సాగును చేస్తున్నారు. 20 నుంచి25 విత్తనాల (Cotton Seed) కంపెనీల యాజమాన్యాలు ఫౌండేషన్ సీడును మధ్యవర్తుల ద్వారా ఈ ప్రాంత రైతాంగానికి అందిస్తూ సాగును ప్రోత్సహిస్తున్నారు. తద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి దొరుకుతుంది.

అయితే నేరుగా బడా సీడ్ కంపెనీల యాజమాన్యాలు రైతును సంప్రదించకుండా ఆర్గనైజర్ల ద్వారా మాత్రమే సాగును ప్రోత్సహిస్తున్నారు. దీంతో చేసేది లేక ఆర్గనైజర్లు చెప్పినట్టే వింటూ రైతులు కాలం గడిపేస్తున్నారు. గతంలో సీడ్ పత్తి పండించడానికి ఒక్కో రైతుకు ఒక్కో ఎకరాకు లక్ష రూపాయలు అడ్వాన్సుగా మూట  అప్పచెప్పేది. కాలక్రమేణా ప్రస్తుతం 50 వేల రూపాయలు మాత్రమే అందిస్తున్నారు. ఈ విషయం కంపెనీలు నేరుగా రైతాంగానికి చెప్పడం లేదు. మధ్యవర్తులు ద్వారానే చెప్పిస్తున్నారు. ప్రతి ఏటా జూన్ మాసంలో ఫౌండేషన్ సీడ్‌ను ఈ ప్రాంత రైతాంగానికి మధ్య వార్తలు ద్వారా (ఆర్గనైజర్ల ద్వారా) అందిస్తారు. అప్పటినుంచి పంట చేతికొచ్చే వరకు (డిసెంబర్) ఆ రైతుకు కావాల్సిన ఎరువులు,  ఆర్గనైజర్లు ఏర్పాటు చేస్తారు. అడ్వాన్స్‌గా ఇచ్చిన అమౌంట్ ఎరువులు, మందుల డబ్బులు మొత్తానికి అప్పుగా రైతాంగానికి అందిస్తారు. వీటికి పంట చేతికొచ్చే నాటికి రైతు ఆర్గనైజర్లకు మిత్తితో చెల్లించాలి.

జెర్మినేషన్‌తో లింకు

డిసెంబర్‌లో పంట చేతికొచ్చేసరికి ఆర్గనైజర్లు రైతు ద్వారా పంట మొత్తాన్ని సేకరించి జిన్నింగ్ మిల్లుకు పంపిస్తారు. అక్కడ విత్తనాలు, పత్తిని వేరు చేస్తారు. పత్తిని రైతులు ఆర్గనైజర్లు చెప్పిన రేటుకే ఇవ్వాలి. బహిరంగ మార్కెట్లో క్వింటాల్ రూ. 12000 పలికితే, రూ.8 వేలకే వేలకే ఆర్గనైజర్లకు ఇవ్వాలి. విత్తనాలలో కొన్నింటిని జర్మినేషన్ కోసం ఒప్పందం చేసుకున్న బడా కంపెనీలకు పంపిస్తారు. ఈ ఫలితాలు రావాలంటే 90 రోజులు ఎదురుచూడాల్సిందే. ఫలితాలు సైతం నేరుగా ఆర్గనైజర్ల ద్వారానే తెలుపుతారు. ఈ జర్మినేషన్ ప్రక్రియ మొత్తం ప్రైవేట్ సంస్థల్లోనే నిర్వహించడంతో రైతు సంఘాల నాయకులు ఆందోళన చేస్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కావడం లేదు. బహిరంగ మార్కెట్లో పత్తి విత్తనాల డిమాండ్ బట్టి జర్మినేషన్ తక్కువ వచ్చింది అంటూ, విత్తనాలను తక్కువకు ధరకు కొనుగోలు చేయడానికి ఒత్తిడి తీసుకువస్తారు. దీంతో చేసేది లేక ఒప్పందం ప్రకారం వారికి ఇవ్వాల్సి ఉంటుంది.

ఏటా రెండువేల కోట్ల వ్యాపారం

జోగులాంబ గద్వాల జిల్లాలో సీడ్ పత్తి వ్యాపారం ఏటా రెండు వేల కోట్ల వరకు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం పత్తి విత్తన రైతులకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించడంలో కూడా చొరవ చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు ఈ విషయంపై దృష్టి సారించకపోవడం వల్లే ఆర్గనైజర్ల చేతుల్లో సీడ్ గ్రోయర్ మోసపోతున్నారని నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు అంటున్నారు. ఆర్గనైజర్లు చేసిన మోసాలపై హక్కుల సంఘం నాయకులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఇప్పటివరకు 20 కోట్ల మేర రైతులకు నష్టపరిహారం బడా విత్తన కంపెనీల ద్వారా అందించారు. తెలంగాణలో సమగ్ర విత్తన చట్టం లేకపోవడం వల్లనే దళారుల ఆకృత్యాలకు రైతులు బలవుతున్నారని నడిగడ్డ హక్కుల సంఘం నేతలు అంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>