Mobile Popup Ad
Mobile Popup Ad

రోడ్డు భద్రతపై కలెక్టర్ ఖుష్బూ గుప్తా కీలక ఆదేశాలు

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : జిల్లాలోని జాతీయ రహదారులపై పెండింగ్‌లో ఉన్న నిర్మాణ పనులను వేగవంతం చేసి, రోడ్డు భద్రతకు సంబంధించిన చర్యలను నిర్దిష్ట గడువులో పూర్తి చేసి ప్రమాదాలను తగ్గించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushboo) అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు.

పోలీస్, ఆర్ & బీ, ఎన్‌హెచ్ ఆర్ & బీ, జాతీయ రహదారి అథారిటీ (NHAI) తదితర విభాగాలు పరస్పరం సమన్వయంతో పనిచేసి రహదారులపై జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ సైన్‌బోర్డులు, బ్యారికేడ్లు, సరైన లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోడ్డు మరమ్మతులు లేదా నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్‌లను  ఏర్పాటు చేసి వాహన రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై కూడా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

NH 44 పై బాలానగర్, రాజాపూర్ ప్రాంతాలలో గ్యాస్, డీజిల్ కొరత కారణంగా పనులు మందగించాయని అధికారులు తెలపగా, బాలానగర్ ఫ్లైఓవర్ పనులను మే నెలాఖరులోపు పూర్తి చేయాలని కలెక్టర్ (Collector Khushboo) ఆదేశించారు. పెద్దయ్యపల్లి, మాదారం ప్రాంతాలలో పెండింగ్‌లో ఉన్న సైన్‌బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్, లైటింగ్ పనులను 10 రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. మన్ననూర్ టోల్‌ప్లాజా వద్ద సైన్‌బోర్డుల పరిమాణాన్ని పెంచాలని, రాజాపూర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి అడ్డుగా ఉన్న విద్యుత్ లైన్ల మార్పిడి పనులను వేగవంతం చేయాలని విద్యుత్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ముదిరెడ్డిపల్లి–మల్లెబోయినపల్లి మధ్య రహదారి పనులు మందగించినప్పటికీ భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు వివరించారు.

తాటిపర్తి ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని, జడ్చర్ల–కల్వకుర్తి రైల్వే బ్రిడ్జ్ సమీపంలోని పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. అడ్డకల్, పొన్నకల్ జంక్షన్‌ల వద్ద లైటింగ్, స్పీడ్ బ్రేకర్‌లు , సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జడ్చర్ల, మహబూబ్‌నగర్ బస్ స్టాండ్‌ల వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ల ప్రతిపాదనలను వేగవంతం చేయాలని, బాలానగర్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహం షిఫ్టింగ్ కోసం తక్షణమే ప్రత్యామ్నాయ స్థలం గుర్తించాలని అధికారులకు సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రహదారులపై నీటి నిల్వలు లేకుండా డ్రైనేజ్ వ్యవస్థను సక్రమంగా ఏర్పాటు చేయాలని, బైపాస్ రోడ్లపై భద్రతా చర్యలను బలోపేతం చేయాలని తెలిపారు. జిల్లాలో ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలను పూర్తిచేసి రోడ్డు భద్రతను పటిష్టం చేయాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎస్పీ డి. జానకి, ఆర్ & బీ, ఎన్‌హెచ్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

Read Also: భగ్గుమన్న తెలంగాణ.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>