నల్లగొండ జిల్లాలో నయా మోసం.. కొలువుల పేరుతో భారీ దోపిడీ!

కలం, నల్లగొండ బ్యూరో : నిరుద్యోగం ఒక శాపమైతే.. ఆ ఆకలిని కొందరు కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తాజాగా దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక ముఠా నిరుద్యోగుల నుంచి ఏకంగా రూ.30 కోట్ల వసూలు చేసిన వైనం నల్లగొండ జిల్లాలో (Nalgonda Job Scam) సంచలనం రేపుతోంది. ఆలయాల్లో హుండీ లెక్కింపు, అటెండెంట్ వంటి కొలువుల పేరుతో నమ్మించి దాదాపు 1500 మందిని నట్టేట ముంచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే దేవాదాయ శాఖలో ఉద్యోగాల పేరిట కోట్లాది రూపాయల వసూళ్లకు పాల్పడి.. ఇన్నేండ్లు కలుగులో దాక్కున్న ప్రధాన నిందితుడు పులి రవి ఎట్టకేలకు గొంతు విప్పాడు. పోలీసులు చుట్టుముడుతున్నారనే భయం.. బాధితుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి వెరసి.. తాను తీసుకున్న డబ్బులను తిరిగి ఇచ్చేస్తానంటూ బాధితులకు నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడి కొలువుల పేరుతో జరిగిన ఈ దోపిడీలో నిందితుడు బయటకు రావడం ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

పక్కా స్కెచ్ వేసి మోసం..

నిరుద్యోగులకు నమ్మకం కలిగించడానికి ఈ ముఠా చాలా పక్కాగా స్కెచ్ వేసింది. ప్రభుత్వ శాఖల్లో, ముఖ్యంగా ఆలయాల్లో హుండీ లెక్కింపు వంటి సులువైన పనులకు భారీ డిమాండ్ ఉంటుందని గుర్తించి దాన్ని ఎరగా వేశారు. నిరుద్యోగులు ఒక్కొక్కరి నుంచి రూ. 2 లక్షలు డిమాండ్ చేశారు. తక్కువ మొత్తమే అని భావించిన నిరుద్యోగులు.. అప్పులు చేసి మరీ ఈ కిలాడీలకు డబ్బులు సమర్పించుకున్నారు. ఈ భారీ స్కామ్‌లో ప్రధాన సూత్రధారిగా పులి రవి అనే వ్యక్తి పేరు వినిపిస్తుండగా, క్షేత్రస్థాయిలో బాధితులను పట్టుకోవడానికి ఏజెంట్లను రంగంలోకి దింపారు. నల్లగొండలో నివసిస్తున్న అన్నారం గ్రామానికి చెందిన జనార్ధన్ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఇదిలావుంటే.. ప్రధాన నిందితుడు రవి తన స్కామ్ కోసం పలువురు ఏజెంట్లను నియమించుకుని నెట్‌వర్క్‌ను విస్తరించాడు. నిరుద్యోగులకు నమ్మకం కలిగించడానికి ‘శాలరీ బాక్స్’ అనే యాప్‌ను ఇన్‌స్టాల్ చేయించి.. అందులో వారి అటెండెన్స్, జీతాల వివరాలు చూపిస్తూ ఇది అసలైన ఉద్యోగమేనని నమ్మించారు.

నిందితులు కేవలం నల్లగొండ జిల్లాలోని నకిరేకల్, శాలిగౌరారం, నార్కట్‌పల్లి, నల్లగొండ మండలాలే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1500 మంది బాధితులు ఉన్నట్లు సమాచారం. ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేశారు. మొత్తంగా ఈ స్కామ్ విలువ సుమారు రూ.30 కోట్ల పైనే ఉంటుందని అంచనా. అయితే బాధితులకు నకిలీ నియామక పత్రాలు ఇవ్వడమే కాకుండా యాప్‌లో జీతాలు పడుతున్నట్లు గ్రాఫిక్స్ చూపించి బాధితులను మభ్యపెట్టారు. నెలలు గడుస్తున్నా అసలు జీతం చేతికి అందకపోవడం.. ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడం.. ఏజెంట్లు ముఖం చాటేయడంతో బాధితులు తాము మోసపోయామని గ్రహించారు. కాగా, బాధితులు నకిరేకల్, కట్టంగూర్, శాలిగౌరారం తదితర ప్రాంతాల నుంచి పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నారు. అప్పులు చేసి లక్షలు కట్టిన పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి.

డబ్బులు తిరిగిస్తానంటూ ప్రచారం..

డబ్బులు ఇచ్చి నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు రాకపోవడం.. అడిగితే ముఠా సభ్యులు ఫోన్లు ఎత్తకపోవడంతో బాధితులు తాము మోసపోయామని గ్రహించారు. ఈ క్రమంలోనే ఇక్కడ విచిత్రమైన పరిస్థితి నెలకొంది. తమ డబ్బులు తిరిగి వస్తాయనే ఆశతో లేదా పైరవీలు చేయడం నేరమని భయపడి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకాడతున్నారు. కొందరు బాధితులు ఏజెంట్ల ఇళ్ల ముందు బైఠాయిస్తున్నా.. వారు “త్వరలో ఇప్పిస్తాం” అని మాయమాటలు చెబుతూ కాలయాపన చేస్తున్నారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రధాన నిందితుడు రవి పోలీసు కేసుల నుంచి తప్పించుకోవడానికి ఇప్పటికే కొందరు బాధితుల ఖాతాల్లోకి స్వల్ప మొత్తంలో నగదు బదిలీ చేసినట్లు సమాచారం. ఇది కేవలం బాధితులు ఫిర్యాదు చేయకుండా అడ్డుకునేందుకు వేసిన ఎత్తుగడ అని చెప్పాలి. అందరికీ డబ్బులు ఇస్తాను.. సమయం ఇవ్వండి అంటూ హామీలు ఇస్తూ అరెస్టు కాకుండా తప్పించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. నిందితుడు రవి ఎంతగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, అతని మాటల్లో పస లేదని గుర్తించిన బాధితులు ఇప్పుడు చట్టపరమైన పోరాటానికి సిద్ధమవుతున్నారు.

ఈ క్రమంలోనే ప్రధాన నిందితుడి అనుచరుల హల్‌చల్ అధికంగా ఉన్న నకిరేకల్ ప్రాంతం నుంచి బాధితులు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే లక్షలాది రూపాయల వడ్డీలు కడుతూ ఆర్థికంగా చితికిపోయిన నిరుద్యోగులు, రవి మాటలను నమ్మే స్థితిలో లేరు. అందుకే “డబ్బులు వచ్చినా రాకపోయినా నిందితులకు శిక్ష పడాల్సిందే” అనే పట్టుదలతో స్టేషన్ మెట్లేక్కేందుకు రెడీ అయ్యారు.

పోలీసులు జోక్యం చేసుకోవాల్సిందే..

నిందితుడు బయటకు వచ్చాడనే సమాచారం ఉన్నా.. పోలీసులు ఇంకా ఎందుకు అరెస్ట్ చేయడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాధితులు నకిరేకల్ పోలీస్ స్టేషన్ వెళ్తున్న తరుణంలో జిల్లా ఎస్పీ ఈ కేసుపై ప్రత్యక్ష నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. అసలు భారీ స్కామ్‌లో రవి కేవలం ఒక ముఖం మాత్రమేనా? దీని వెనుక దేవాదాయ శాఖలోని ఉన్నతాధికారుల హస్తం గానీ, రాజకీయ అండదండలు గానీ ఉన్నాయా అనే కోణంలో విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఇదిలావుంటే.. బాధితుల నుంచి వసూలు చేసిన కోట్ల రూపాయలను రవి ఎక్కడ పెట్టుబడి పెట్టాడు? ఇప్పుడు ఇస్తానంటున్న డబ్బు అసలు బాధితులదా లేక వేరే మోసానికి పాల్పడి సర్దుబాటు చేస్తున్నాడా అన్నది తేలాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>