epaper
Wednesday, January 21, 2026
spot_img
epaper

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై టాటా గ్రూప్​ ఆసక్తి

కలం, వెబ్​ డెస్క్ : దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు (WEF Davos)లో టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి తెలంగాణ రైజింగ్ విజన్–2047, ప్రభుత్వ విధానాలు, రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని టాటా చైర్మన్‌కు వివరించారు. తెలంగాణ రాష్ట్రం రూపొందించిన దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను వెల్లడించారు. హైదరాబాద్‌లోని ప్రధాన క్రీడా మైదానాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దే ఆలోచనలను రేవంత్​ రెడ్డి టాటా గ్రూప్ చైర్మన్ తో పంచుకున్నారు.

భవిష్యత్ అవసరాలకు ప్రణాళికాబద్ధమైన ఆలోచన విధానంపై టాటా చైర్మన్ చంద్రశేఖరన్ (Natarajan Chandrasekaran) ప్రశంసించారు. పెట్టుబడుల కోసం కాకుండా, విధానాలు, ఫ్యూచర్ విజన్‌ను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ముందుకెళ్తోందని అభినందించారు. స్పోర్ట్స్ స్టేడియం అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకునేందుకు, ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చంద్రశేఖరన్ తెలిపారు. దేశంలో ప్రతిభ ఉన్నా.. దానికి తగిన మౌలిక సదుపాయాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. యువత నైపుణ్యాల అభివృద్ధిపై కూడా చర్చించారు.

65 ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా మార్చడంలో టాటా టెక్నాలజీస్‌తో కలిసి పనిచేస్తున్నామని సీఎం వెల్లడించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ సెంటర్లుగా అభివృద్ధి చేసే ప్రణాళికలను వివరించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఆనంద్ మహీంద్రా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు ఆలోచనలు.. 2036 ఒలింపిక్స్ లో భారత్ పతకాలు సాధించేలా క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యాలను వివరించారు.

WEF Davos
WEF Davos

హైదరాబాద్ లో చేపడుతున్న మూసీ నది పునరుజ్జీవన (Musi Rejuvenation) ప్రాజెక్టుపై టాటా చైర్మన్ ఆసక్తి చూపారు. రాజస్థాన్, మహారాష్ట్రలో నీటి వనరుల పునరుద్ధరణలో టాటా గ్రూప్ అనుభవాన్ని గుర్తుచేస్తూ, మూసీ అభివృద్ధిలో భాగస్వామిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మూసీ నది చుట్టూ ఆర్థిక కార్యకలాపాలు పెరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

రాష్ట్రంలో హోటళ్లు, రిసార్టులు ఏర్పాటు చేసే అంశంపై ఈ సమావేశం లో చర్చలు జరిగాయి. మేడారం, వేములవాడ, భద్రాచలం వంటి ఆలయ ప్రాంతాల్లో హోటళ్ల ఏర్పాటుకు టాటా గ్రూప్ ఆసక్తి చూపింది. శ్రీశైలం రహదారి వెంబడి అంతర్జాతీయ స్థాయి రిసార్ట్ ఏర్పాటుపై సానుకూలంగా స్పందించింది. ఏఐ డేటా సెంటర్లు, సెమీకండక్టర్, ఈవీ తయారీ రంగాల్లో తెలంగాణలో కొత్త పరిశ్రమలు నెలకొల్పే అవకాశాలపై టాటా చైర్మన్ చంద్రశేఖర్​ ఆసక్తి ప్రదర్శించారు. ఈ సమావేశంలో మంత్రులు డి. శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read Also: బావబామ్మర్దుల్లో ఎవరి బలమెంత?

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>