కలం, డెస్క్ : మెగాస్టార్ చిరంజీవికి స్టార్ సింగర్ చిన్మయి కౌంటర్ ఇచ్చింది. ఇండస్ట్రీలో ప్రోత్సాహమే ఉంటుంది తప్ప కాస్టింగ్ కౌచ్ లాంటివి ఉండవని చిరంజీవి (Chiranjeevi) మన శంకర వర ప్రసాద్ గారు మూవీ సక్సెస్ మీట్ లో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తాజాగా చిన్మయి (Chinmayi) ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. ‘ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే అమ్మాయిలు కమిట్ మెంట్ ఇవ్వకపోతే ఛాన్సులు రావు. వాస్తవానికి కమిట్ మెంట్ అంటే పని పట్ల నిబద్ధతగా ఉండటం. కానీ ఇండస్ట్రీలో దాని అర్థాన్ని మార్చేసి.. ఏవేవో ఆశిస్తున్నారు. నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే. ఇలాంటి వేధింపులు భరించలేక అనేక మంది ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి తరంలో ఇలాంటి వేధింపులు లేవు. అప్పటి హీరోయిన్లు, ఇతర మహిళా ఆర్టిస్టులను ఎంతో గౌరవించేవారు. స్నేహితులుగా చూసేవారు. కానీ నేటి తరంలో అలాంటివి లేవు. లెజెండ్స్ తో పనిచేసిన వారు లెజెండ్స్ గానే ఉంటారు. చిరంజీవి తరం నాటిరోజులు ఇప్పుడు లేవు. ఇప్పటికీ కాస్టింగ్ కౌచ్ బాధితులు అనేక వేదికల మీద మాట్లాడుతున్నారు’ అంటూ తెలిపింది సింగర్ చిన్మయి.
ఆమె వ్యాఖ్యలతో మరో కొత్త వివాదం మొదలైనట్టే కనిపిస్తోంది. కాస్టింగ్ కౌచ్, మహిళల హక్కుల గురించి ఎప్పటికప్పుడు చిన్మయి స్పందిస్తూనే ఉంటుంది. మొన్న శివాజీ హీరోయిన్ల బట్టలపై చేసిన కామెంట్ల మీద చిన్మయి సీరియస్ అయింది. ఇప్పుడు చిరంజీవి మాటలపైనే చిన్మయి ఇలా స్పందించడంతో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.


