కలం వెబ్ డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao)కు సిట్(SIT) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం రాత్రి హరీష్ సిద్ధిపేట నుంచి హైదరాబాద్ బయలుదేరి వచ్చారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు హరీష్ రావు సిట్ విచారణకు హాజరుకానున్నారు. దీనికి ముందు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ (KTR) సహా బీఆర్ఎస్ (BRS) ముఖ్య నేతలతో హరీష్ రావు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో సిట్ విచారణ గురించే చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీ అనంతరం తెలంగాణ భవన్(Telangana Bhavan) నుంచి నేరుగా హరీష్ రావు విచారణకు బయలుదేరుతారు. మరోవైపు కేటీఆర్ హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బొగ్గు కుంభకోణాన్ని డైవర్ట్ చేయడానికే ఈ నోటీసులు జారీ చేశారని ఆరోపిస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును సిట్ బృందం ఇటీవల విచారించింది. ప్రభాకర్ రావు హరీష్ రావుతో పలుమార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు గుర్తించింది. ఈ విషయంపై ప్రభాకర్‌రావును ప్రశ్నించగా కేవలం మావోయిస్టుల గురించి మాట్లాడుకున్నట్లు చెప్పారు. ఇప్పుడు హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేయడంతో ఈ కేసులో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.


