కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉన్న రెయిన్‌బో విస్టాస్ గేటెడ్ కమ్యూనిటీలో బ్లింకిట్ డెలివరీ బాయ్స్ (Blinkit delivery boys) దౌర్జన్యానికి దిగారు. భద్రతా సిబ్బందిపై మూకుమ్మడి దాడి చేశారు. ఆదివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గేటు వద్ద అనుమతి లేకుండా లోపలికి వెళ్లడాన్ని సెక్యూరిటీ గార్డు అడ్డుకోవడమే ఈ గొడవకు కారణమైనట్లు తెలుస్తోంది.
నిబంధనల ప్రకారం అనుమతి తప్పనిసరని భద్రతా సిబ్బంది వారించడంతో ఆగ్రహానికి గురైన డెలివరీ ఏజెంట్, తన సహచరులను అక్కడికి పిలిపించాడు. దీంతో గుంపుగా వచ్చిన బ్లింకిట్ వర్కర్లు (Blinkit delivery boys) అక్కడి సెక్యూరిటీ గార్డులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులకు తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడి సిసిటివి కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఈ ఘటనపై రెయిన్‌బో విస్టాస్ మేనేజ్‌మెంట్ కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజీని ఆధారంగా అందించింది. దీంతో పాటు గేటెడ్ కమ్యూనిటీలో బ్లింకిట్ డెలివరీ సేవలను యాజమాన్యం తాత్కాలికంగా నిలిపివేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


