కలం, వెబ్ డెస్క్: రిటైర్డ్ ఉద్యోగుల హక్కుల కోసం బీజేపీ ఫైట్ చేస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశంలోనూ ఉద్యోగుల సమస్యలపై బీజేపీ గళమెత్తింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో బీజేపీ మంగళవారం మహాధర్నా (BJP Maha Dharna)కు దిగబోతోంది. ఈ మేరకు ఎమ్మెల్సీ అంజిరెడ్డి సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని కోర్టు మొట్టికాయలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు రాలేదని, 700 కోట్లు నెలనెల ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం, ఇంత వరకు ఇచ్చింది లేదని ఆయన మండిపడ్డారు. రిటైర్డ్ బెనిఫిట్ అనేది ఉద్యోగాల హక్కు అని, ఆ హక్కులను సైతం ప్రభుత్వం అణచివేయడం దుర్మార్గమన్నారు.
బీఆర్ఎస్ అన్యాయం చేసిందని, ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేశారని, కాంగ్రెస్ (Congress) సైతం బీఆర్ఎస్ బాటలోనే నడుస్తోందని అంజిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పదవి విరమణ చేసిన ఉద్యోగులకు చేసిన మేలు శూన్యమని, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై రేపు (మంగళవారం) ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని, ఈ ధర్నా కేవలం ప్రారంభం మాత్రమే, రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున్న ఆందోళన చేస్తామని ఎమ్మెల్సీ అంజిరెడ్డి హెచ్చరించారు.
అనంతరం సీనియర్ నేత మల్కా కొమరయ్య మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయినా ఇప్పటి వరకు రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వలేదని, ఎప్పుడూ వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన అన్ని బెనిఫిట్స్ వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని కొమరయ్య డిమాండ్ చేశారు.


