కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని కంజర్, కులాస్ పూర్, బాడ్సి తదితర గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను, రోడ్లపై ఉన్న ధాన్యం కుప్పలను బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ (BJP Leader Dinesh Patel) క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, డీఎస్ఓ అధికారులతో మాట్లాడి లారీ కొరత ఉంటే మాట్లాడి తెప్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కులాస్ పూర్ లో రైతులు పంట కోసి 25 రోజులు గడుస్తున్నా ఇంతవరకు కొనుగోలు ప్రక్రియ ప్రారంభించకపోవడం శోచనీయం అన్నారు.
రాబోయే రెండు రోజులలోపు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, రోడ్లపై ఉన్న ధాన్యాన్ని సేకరించకపోతే.. వేలాది మంది రైతులతో కలిసి జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని దినేష్ పటేల్ హెచ్చరించారు. వర్షాల వల్ల రోడ్లపై ఉన్న ధాన్యం తడిసి ముద్దవుతున్నా పట్టించుకునే నాథుడే లేడని విమర్శించారు. ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని రైతులు అడిగితే బస్తాలు లేవు, లారీలు రావడం లేదు, సాఫ్ట్‌వేర్ సమస్య ఉందంటూ అధికారులు సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని వేలెత్తి చూపారు. 20 నుండి 25 రోజుల పాటు ధాన్యం రోడ్లపైనే ఎండడం వల్ల తరుగు ఏర్పడుతోందని చెప్పారు. ఒక్కో బస్తాకు దాదాపు 5 కిలోల వరకు తరుగు వస్తోందని దీనివల్ల రైతు క్వింటాలుకు రూ.300 వరకు నష్టపోతున్న రైతును ఆదుకోవాల్సింది పోయి, మరింత కుంగదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వడ్లు కొనుగోలు చేయడం చేతకాకపోతే, రైతులు తక్కువ ధరకైనా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకొని తమ బాధ తాము పడేవారని ధ్వజమెత్తారు. దొడ్డు రకం వడ్లు కొనబోమని అధికారులు చెప్పడం హాస్యాస్పదం అని విమర్శించారు. కొననప్పుడు ఆ విత్తనాలను రైతులకు ఎందుకు సరఫరా చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. సన్న, దొడ్డు రకం అనే వివక్ష లేకుండా ప్రతి గింజనూ ప్రభుత్వం మద్దతు ధరకు సేకరించాల్సిందేనని డిమాండ్ చేశారు.

