కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండ కార్పొరేషన్ (Nalgonda Corporation) మొదటి మేయర్ పీఠం తమ పార్టీకే లభిస్తుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ (MP Laxman) ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా బిజెపి కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లగొండ కార్పొరేషన్ 48 స్థానాల్లో తమ అభ్యర్థులను ఖరారు చేశామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇస్తే ప్రజల ఆశలు నెరవేరుస్తామని పిలుపునిచ్చారు. తెలంగాణ భవిష్యత్తు బీజేపీతోనే సురక్షితమని, పట్టణాభివృద్ధికి కేంద్ర–రాష్ట్ర సమన్వయంతో బలమైన పాలన అందిస్తామని స్పష్టం చేశారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వ సహకారంతో నేరుగా నిధులు కార్పొరేషన్లకు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం నుంచి ప్రత్యేక గ్రాంట్లు, స్మార్ట్ సిటీ, అమృత్, గృహ నిర్మాణం, డ్రైనేజీ, రోడ్లు, తాగు నీటి పథకాలకు వేగంగా నిధులు వస్తాయని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజల్లో మార్పు కోరుకునే భావన స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. గతంలో టీఆర్‌ఎస్ అవినీతి, కుటుంబ పాలనతో ప్రజలు విసిగి మార్పు కోసం కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారని, అయితే రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోందని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ గ్యారంటీలు, హామీలు అమలు కావడం లేదని, యువత, మహిళలు, రైతులు, బడుగు బలహీన వర్గాలు మోసపోయిన భావనలో ఉన్నారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి 35 శాతం ఓట్లు ఇచ్చి 8 మంది ఎంపీలను గెలిపించడం ద్వారా స్పష్టమైన సంకేతం ఇచ్చారని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, పేదల సంక్షేమ పథకాలు ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా ప్రజలకు చేరుతున్నాయని ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) చెప్పారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ గోగుల శ్రీనివాస్ ను బిజెపిలోకి ఆహ్వానించి కండువా కప్పి పార్టీలో జాయిన్ చేసుకున్నారు.
Read Also: మేడారంలో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్
Follow Us On: Pinterest


