కలం, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ (PM Modi)కి సామాన్యుల జీవితాల్లోని అసాధారణ విషయాలను గుర్తించే గొప్ప నైపుణ్యం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కొనియాడారు. పెద్ది (Peddi) సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో రామ్ చరణ్ (Ram Charan) ఓ వేదికపై మాట్లాడిన స్పెషల్ వీడియోను బండి సంజయ్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఆ వీడియోలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఢిల్లీలో ప్రధాని మోదీతో ఒక సందర్భంలో పెద్ది సినిమా గురించి చర్చించినట్లు తెలిపారు. పెద్ది సినిమా దేని గురించి ఉంటుందని మోదీ ప్రశ్నించారని రామ్ చరణ్ వెల్లడించారు. దానికి చరణ్ బదులిస్తూ ఇది గ్రామాలను బలోపేతం చేసే విధంగా ఉంటుందని చెప్పినట్లు తెలిపారు. ఈ సందర్బంగా మోదీ దశాబ్దాల క్రితం భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన పశ్చిమబెంగాల్‌లోని ఒక చిన్న గ్రామానికి చెందిన ఫుట్ బాల్ క్రీడాకారుడు మొహమ్మద్ గురించి గుర్తు చేసుకున్నారని తెలిపారు. ఒక వ్యక్తి విజయం ఒక గ్రామాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనడానికి ఆ ఫుట్ బాల్ క్రీడాకారుడి కథే నిదర్శనమని, నేడు ఆ గ్రామం నుంచి 85 మందికి పైగా యువకులు ఫుట్ బాల్ ఆడుతున్నారని మోదీ వివరించినట్లు వెల్లడించారు.
ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ బండి సంజయ్ (Bandi Sanjay) మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రధాని మోదీ ఎప్పుడూ వాస్తవ పరిస్థితులు, సామాన్యుల విజయ గాథల గురించి మాట్లాడుతుంటారని తెలిపారు. దేశ మార్పు కేవలం ప్రభుత్వ విధానాల వల్ల మాత్రమే రాదని, కోట్లాది మంది వ్యక్తులు ఇతరులకు స్ఫూర్తినిస్తూ కష్టపడి పని చేసినప్పుడే సాధ్యమవుతుందని మోదీ నమ్ముతారని ఆయన వివరించారు. ఒక వ్యక్తి విజయం గ్రామాన్ని మార్చగలిగితే , ఇలాంటి లక్షలాది కథలు ఒక దేశాన్ని మార్చగలవని సంజయ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఒక సినిమా గురించి జరుగుతున్న సంభాషణను కూడా దేశ అభివృద్ధికి సంబంధించిన పాఠంగా మార్చడం కేవలం నరేంద్ర మోదీకే సాధ్యమని బండి ప్రశంసించారు.
Read Also: ఈ ఫేస్ ప్యాక్‌తో ముఖం మెరిసిపోవాల్సిందే.. ట్యాన్, మచ్చలకు చెక్!
Follow Us On : WhatsApp

