కలం, హనుమకొండ: హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ (Hanumakonda Congress) కార్యాలయంలో బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వరంగల్ విమానాశ్రయ కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమం చేపట్టారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకటరామిరెడ్డి ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. దశాబ్దాలుగా వరంగల్ ప్రజలు ఎదురుచూస్తున్న విమానాశ్రయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ విమానాశ్రయం అందుబాటులోకి రావడం వల్ల ప్రాంతీయ అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని, పెట్టుబడులు పెరగడంతోపాటు ఉపాధి అవకాశాలు కూడా విస్తృతంగా లభిస్తాయని నాయకులు అభిప్రాయపడ్డారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు రహమతుల్లా మహమ్మద్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

