కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కొణిజర్ల మండలం అంజనపురం (Anjanapuram) గ్రామంలో నూతనంగా నిర్మించిన గోద్రేజ్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పర్యటన ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ (Collector Divakara) అధికారులను ఆదేశించారు.
బుధవారం సీఎం పర్యటన భద్రతా ఏర్పాట్లు, ముందస్తు చర్యలను కలెక్టర్ దివాకర టీఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డిలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ ప్రాంగణం, సభా వేదిక, హెలిప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గోద్రేజ్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం జిల్లా రైతాంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా రైతులకు పామాయిల్ పంట మార్కెటింగ్, ప్రాసెసింగ్ సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు.
సీఎం పర్యటనకు భారీ సంఖ్యలో రైతులు, ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున తాగునీరు, పారిశుధ్యం, సీటింగ్, ప్రవేశ మార్గాలు వంటి సౌకర్యాలను పక్కాగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యటన నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని పోలీసు శాఖకు సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలని తెలిపారు. వైద్య, విద్యుత్, అగ్నిమాపక శాఖలు అప్రమత్తంగా ఉండాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

